అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రతిపక్ష నాయకుల్ని వైరి వర్గాలుగా చూడాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యలను ఎత్తి చూపడం ప్రతిపక్షం బాధ్యత. ప్రతిపక్షాల సూచనల్ని విశ్లేషణాత్మకంగా పరిశీలించి స్పందించడం అధికార పార్టీ కర్తవ్యం. కానీ, తెలంగాణ శాసన సభలో మాత్రం ఇలాంటి వాతావరణం కనిపించడం లేదు! అధికార పక్షం ఆట మాత్రమే సాగుతోంది. ఈ ఆటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జానారెడ్డి పదేపదే పావుగా మారుతున్నారు! ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నోరును మూయించేందుకు జానారెడ్డి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలత ప్రదర్శిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ‘ఆయన పెద్దవారూ, ఆయనకి అన్నీ తెలుసు’ అంటూ అనుకూంటూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు జానారెడ్డికి మరింత మర్యాద ఇచ్చేస్తున్నారు. కేసీఆర్ ఇస్తున్న మర్యాదే జానారెడ్డికి ఇబ్బందికరంగా మారుతోంది.
తాజాగా జానారెడ్డి ఇంటికి తాను భోజనానికి వెళతానని కేసీఆర్ అనడం విశేషం. రెండు పడకల ఇళ్ల గురించి సభలో జరిగిన లఘు చర్యలో ఈ చర్చ జరిగింది. ఈ చర్చలో జానారెడ్డి జోక్యం చేసుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారు ఆ ఇళ్లకు స్వయంగా వెళ్లి భోజనం చేసి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అన్నారు. ఆ మాటకు వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. తనకు ఎప్పట్నుంచో ఓ కోరిక ఉందనీ, ప్రతిపక్ష నాయకుడు ఇంటికి భోజనానికి వెళ్లాలని ఉందని అన్నారు. గతంలో కొన్నిసార్లు వెళ్దామనుకున్నా పరిస్థితులు సహకరించలేదని చెప్పారు. ఓసారి కచ్చితంగా వెళ్దామని నిర్ణయించుకున్న సందర్భంలో ఉప ఎన్నికలు వచ్చాయనీ, అప్పుడు వెళ్లుంటే అందరూ ఇంకోలా అనుకుంటారని ఆగిపోయానని కేసీఆర్ అన్నారు. ఇదేదో తాను కొత్తగా చేస్తున్న పనేం కాదనీ, గతంలో నీలం సంజీవరెడ్డి వంటి నాయకులు ఇలానే చేసేవారని చెప్పారు. జానారెడ్డి ఇంటికి వెళ్లి భోజనం చేయడం ఖాయమని కేసీఆర్ స్పష్టం చేయడం విశేషం!
కేసీఆర్ అన్నట్టుగానే చేస్తారనడంలో సందేహం లేదు. జానా ఇంటికి భోజనానికి వెళ్లి ఓ కొత్త సంప్రదాయానికి తెర తీస్తారనే చెప్పుకోవచ్చు! మరి, స్వయంగా ముఖ్యమంత్రే తన ఇంటికి భోజనానికి వస్తానంటే జానారెడ్డి పిలవాల్సిందే కదా. సరిగ్గా అక్కడే మరోసారి కాంగ్రెస్కు చెక్ పెట్టినట్టు చేశారు కేసీఆర్! ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ను కట్టడి చేసేందుకు జానారెడ్డికి ఊపిరాడకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో మద్దెల దరువు అన్నట్టుగా.. జానారెడ్డికి రెండువైపుల నుంచీ ఒత్తిడి పెరుగుతోంది. ఆయనకి అతి మర్యాద ఇచ్చేస్తూ కేసీఆర్ పొగుడుతూ ఉంటే… కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు సంకట పరిస్థితుల్లో జానా నెడుతున్నారంటూ స్వపక్షంలో నాయకుల నుంచీ ఇబ్బంది ఉండనే ఉంది. ఇంతకీ, జానా ఇంటికి భోజనానికి కేసీఆర్ ఎప్పుడు వెళతారో..!