“మంచి చేస్తే మంచి అని చెబుతాం.. వైఎస్ తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ పథకం సూపర్ . అందుకే దాన్ని పేరు కూడా మార్చకుండా కంటిన్యూ చేస్తున్నాం. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ లోపాల పుట్ట. దాన్ని అమలు చేయడం లేదు…” అని కేసీఆర్ ఎన్ని సార్లు చెప్పారో లెక్కలేదు. అసెంబ్లీలో కూడా చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడం లేదని వస్తున్న విమర్శలపై ఆయన అలా స్పందించేవారు. అయితే అది గతం. ఇప్పుడు రాజకీయాలు.. రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అందుకే.. ఆయుష్మాన్ భారత్‌లో కేసీఆర్‌కు మంచి కనిపిస్తోంది. అమలుచేయకపోతే తెలంగాణ ప్రజలు నష్టపోతారని అనుకుంటున్నారు. వెంటనే.. కేంద్రానికి సమాచారం పంపారు. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేస్తామని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. బుధవారం… రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో.. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలోనే.. ఆయుష్మాన్ భారత్ ప్రస్తావన వచ్చింది. ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా సోమేష్ కుమార్.. తెలంగాణలో కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రధానమమంత్రికి తెలిపారు. తర్వాత ఆ విషయాన్ని ప్రెస్‌నోట్ ద్వారా విడుదల చేశారు. కేసీఆర్ నిర్ణయం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. ఎందుకిలా… కేసీఆర్ తగ్గిపోతున్నారన్న చర్చ ప్రారంభమయింది.
గ్రేటర్ ఎన్నికలకు ముందు…కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల తరవాత శాంతి కోరుకుంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క సేట్ట్ మెంట్ ఇవ్వడం లేదు. పైగా.. ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రుల్ని కలిసి వచ్చారు. ఆ తర్వాత సీన్ మారిపోయింది. రెండు వారాలు ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుని వచ్చిన తర్వాత అనూహ్యమైన నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. బీజేపీతో స్నేహం కోసం వెంపర్లాడుతున్నట్లుగా ఆ నిర్ణయాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం.. వరంగల్‌లో బీజేపీకి వ్యతిరేకంగా భారీ ధర్నా చేపట్టారు. టెంట్లు కూడా వేశారు. కానీ హైదరాబాద్ నుంచి హెచ్చరికలు రావడంతో… అప్పటికప్పుడు వాటిని తీసేశారు. దాంతో.. మొత్తం టీఆర్ఎస్ క్యాడర్ కు..బీజేపీతో ఎలా ఉండాలో సంకేతాలు వెళ్లాయి. కేసీఆర్ తన నిర్ణయాలతోనూ బీజేపీ అంటే భయభక్తులతో ఉండాలన్న సంకేతాలను పంపుతున్నారు.