తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్కు రాను రాను ఆర్థిక నిర్వహణ కత్తిమీద సాములా మారుతోంది. సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడం… వడ్డీలు చెల్లించడం… ప్రాజెక్టులకు నిధులు అప్పులు తేవడం తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో ఈ సారి బడ్జెట్లో అప్పుల మీద కన్నా ఆదాయం పెంచుకోడం మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం పెద్ద ఎత్తున పన్నులను బాదేయడానికి రంగం సిద్దం చేస్తున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనూహ్యంగా పెరిగింది. భూముల విలువలు బాగా పెరిగాయి. రిజిస్ట్రేషన్లు కూడా గణనీయంగా పెరిగాయి.
అయితే తెలంగాణ ఏర్పడినప్పటి నుండి భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు చేయలేదు. కొత్తగా తీసుకు వచ్చిన ధరణి చట్టం ప్రకారం… పెంచుదామని అనుకున్నారు కానీ… ఇబ్బందులు ఎదురయయాయి. అందుకే ఇప్పుడు.. బడ్జెట్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆశిస్తున్నారు. అలాగే… మద్యంపై పన్ను పెంచడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది. పొరుగున ఉన్న ఏపీతో పోలిస్తే మద్యం రేట్లు చాలా తక్కువే. ఒక్క పదిశాతం మేర పెంచినా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. పైగా …ఏపీ నుంచి కూడా కొనుగోళ్లు పెరిగాయి. సరిహద్దు జిల్లాల్లో అమ్మకాలు అమాంతం పెరిగాయి.
ఈ కారణంగా పెద్ద ఎత్తున ఆదాయాన్ని మద్యం రేట్లను పెంచడం ద్వారా తెలంగాణ సర్కార్ ఆశిస్తోంది. అదే సమయంలో.. భూముల అమ్మకం అనేది ఈ సారి సీరియస్గా చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. గత ఏడాది బడ్జెట్లో అంచనా వేసినా…. అమ్మలేకపోయారు. ఈ సారి మాత్రం.. అలాంటి పరిస్థితి రానీయకూడదని.. ఈ ఏడాది భూముల్ని అమ్మి కనీసం రూ. ఇరవై వేల కోట్ల వరకూ సమీకరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఇరవై శాతం వరకూ వడ్డీలకే పోతోంది. అందుకే ఇక నుంచి అప్పులపై మరీ ఆధారపడకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. అదే సమయంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేయాల్సి ఉంది.