తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీకి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి స్నేహమే ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన కొన్ని అంశాల దృష్ట్యా ఇది మంచిదే. అయితే, ఏపీలో కొంతమంది వైకాపా నాయకులకు దక్కాల్సిన పదవులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కేసీఆర్ జోక్యం చేసుకుంటున్నారా…? అంటే, అవుననే అనిపిస్తోంది! తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి కోసం కేసీఆర్ ఒక వైకాపా నేత పేరును బలంగా సూచించారని గుసగుసలు వినిపిస్తున్నాయి! అయితే, ఇప్పటికే ఆ పదవిని మరో నాయకుడికి ఇస్తారని జగన్ మాటిచ్చారు.
గడచిన ఎన్నికల్లో రాజంపేటకి చెందిన మాజీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డికి వైకాపా నుంచి సీటు దక్కలేదు. ఎందుకంటే, టీడీపీ నుంచి గెలిచి వచ్చిన మేడా మల్లికార్జున రెడ్డికి అక్కడ వైకాపా టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో, అమర్ నాథ్ రెడ్డి అసంతృప్తికి గురి కాకుండా జగన్ ఓ హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మధ్యనే తిరుమల పర్యటనకు వెళ్లారు కదా! ఈ సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి కేసీఆర్ వెళ్లారు. ఆయన ఇంటికి వెళ్లారనే ఆసక్తి కూడా కొంత నెలకొంది. చెవిరెడ్డి కూడా కేసీఆర్ కి బాగానే మర్యాదలు చేశారు. ఈ మీటింగ్ తరువాత టీటీడీ ఛైర్మన్ పదవిని చెవిరెడ్డికి ఇస్తే బాగుంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డట్టు వినిపిస్తోంది. ఇదే అంశమై చెవిరెడ్డితో కేసీఆర్ మాట్లాడి… తన అభిప్రాయంగా ఏపీ ప్రభుత్వానికి తెలియజేస్తా అని కూడా అన్నట్టు వైకాపా వర్గాల్లో కొంతమంది చెబుతున్నారు.
కేసీఆర్ సూచనలూ సలహాలను జగన్ బాగానే పాటిస్తున్నట్టే ఉన్నారు. ఏపీ ఇంటెజెన్స్ బాస్ విషయంలో కూడా తన రాష్ట్రంలో ఉన్న అధికారిని డెప్యుటేషన్ మీద పంపించేందుకు కేసీఆర్ సిద్ధమైన పరిస్థితి చూశాం. అలాగని, ఇప్పుడు కేసీఆర్ రికమండ్ చేస్తున్నారు కదా అని చెవిరెడ్డికి జగన్ అవకాశం ఇస్తే…. అమర్ నాథ్ రెడ్డి పరిస్థితి ఏంటనేది కచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. దీనిపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. ఐదేళ్లపాటు పదవీ కాలం ఉంది కాబట్టి, కావాలనుకుంటే రెండేళ్లకు ఒకరు చొప్పున టీటీడీ ఛైర్మన్ పదవిని కూడా ఇవ్వొచ్చు. మొత్తానికి, టీటీడీ ఛైర్మన్ పదవిపై కేసీఆర్ ఒక పేరును సిఫార్సు చేస్తున్నట్టుగా ఈ వ్యవహారమంతా కనిపించడం కొంత ఆసక్తికరంగా మారుతోంది.