గత ఏడేళ్లుగా నిర్మాణంలో ఉన్న తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎట్టకేలకు ప్రారంభమవుతోంది. తెలంగాణలో ఉన్న అన్ని సీసీకెమెరాలను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించవచ్చు. ఆగస్టు 4వ తేదీన కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో, ఐకానిక్ భవనంగా తీర్చిదిద్దిన ఈ భవనాన్ని బంజారాహిల్స్లో రూ.585 కోట్లతో నిర్మించారు.భవనం ప్రారంభమైన తర్వాత ఆగస్టు రెండో వారంలో నగర పోలీసు కార్యాలయం అక్కడ్నుంచే నడుస్తుంది.
ఇకపోతే.. పోలీస్ కమాండ్ సెంటర్ భవనం ఒక లక్షా 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దీని నిర్మాణం వల్ల తెలంగాణలోని ప్రతి అంగుళం ఇక 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ పరిధిలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ బిల్డింగ్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా కూడా క్షణాల్లో కనిపెట్టొచ్చు. ఈ భవన నిర్మాణాన్ని రూ. 350 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టారు. కానీ వ్యయం రూ. 550 కోట్లు దాటిపోయింది. నాలుగు బ్లాకుల్లో ఏ, బీ, సీ, డీ కమాండ్, కంట్రోల్ సెంటర్ టవర్లుంటాయి.
ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రజలు కూడా సందర్శించేందుకు వీలుంది. 19 అంతస్తులున్న ఈ భవనంలో సందర్శకులు 14, 15 అంతస్తుల వరకు వెళ్లేందుకు అధికారులు అనుమతిస్తారు. అక్కడి నుంచి నగరాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించొచ్చు. అయితే ఇందుకోసం ఛార్జీ వసూలు చేయనున్నారు. దీంతో పాటు ఆరో అంతస్తులోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి వెళ్లి బయట నుంచే పోలీసులు చేస్తున్న ఆపరేషన్ను చూసేందుకు అనుమతి ఇస్తారు. పోలీసుల విధుల్ని ఈ కమాండ్ సెంటర్ మరింత తేలిక చేస్తుంది.