తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ మరో పత్రిక పెట్టబోతున్నారు. నమస్తే తెలంగాణకు తోడుగా ఆంగ్లంలో దినపత్రిక అవసరమని ఆయన భావిస్తున్నారు. అందుకే, జులైలో కొత్తగా ఆంగ్ల దినపత్రికను ప్రారంభించబోతున్నట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది.
కేసీఆర్, తెరాస భావాలను జనానికి చేరువ చేయడానికి నమస్తే తెలంగాణ పత్రిక ఉపయోగపడుతోంది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికి, అధికార పార్టీకి ప్రచారం చేసపెట్టడానికి అది ఎంతో ఉపయుక్తంగా ఉంది.
అయితే ఆంగ్లంలోనూ తమకు ప్రాచుర్యం తెచ్చిపెట్టే పత్రిక ఉండాలని ఆయన భావించారు. ప్రస్తుతం ఉన్న ఆంగ్ల పత్రికలు అంతగా తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనేది కేసీఆర్ భావన. తెలుగు పత్రికలతో ఆ సమస్య లేదు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్లు ఇబ్బంది పడిన తీరు చూసిన తర్వాత తెలుగు మీడియాలో ప్రభుత్వానికి, తెరాసకు వ్యతిరేకంగా వార్తలు రావడం బహు అరుదు. హైదరాబాదులో మనుగడ సాగించాలంటే ప్రభుత్వానికి కోపం తెప్పించకూడదనేది మీడియా సంస్థల ఉద్దేశం.
అయితే ఆంగ్ల పత్రికల విషయం వేరు. చాలా వరకు జాతీయ స్థాయి పత్రికలు. ఢిల్లీలోనో ముంబైలోనో ప్రధాన కార్యాలయాలుంటాయి. ఏబీఎన్ ఎపిసోడ్ కు బెంబేలెత్తిపోయి చెప్పింది మాత్రమే రాసుకుంటామనే ధోరణి ఆ పత్రికల్లో కనిపించడం లేదు. అందుకే, ఆంగ్ల పత్రికల్లో కవరేజీ తెరాస పెద్దలకు సంతృప్తి కలిగించడం లేదు.
తమకే ఓ సొంత ఆంగ్ల పత్రిక ఉంటే మేలని కేసీఆర్, ఆయన కుటుంబీకులు నిర్ణయానికి వచ్చారట. తెలంగాణ టుడే పేరుతో త్వరలోనే పత్రిక జనం చేతుల్లోకి రాబోతుంది. జులైలో మొదటి సంచిక ముద్రణకు సన్నాహాలు జరుగుతున్నాయట. తెలుగేతరులు, తెలుగు చదవలేని ఈ తరం యువతకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ పత్రిక రాబోతుంది.
అలాగే జాతీయ స్థాయిలోనూ పార్టీకి, కేసీఆర్ కు మరింత గుర్తింపు తేవడానికి కూడా ఇదే మంచి సాధనమని గులాబీ శ్రేణుల నమ్మకం. ఆంగ్ల పత్రిక ద్వారా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం సులభం. మొత్తం మీద నమస్తే తెలంగాణకు ఓ ఆంగ్ల పత్రిక తోడు కాబోతోంది. రెండు నెలల్లోనే పాఠకులను పలకరించబోతోందనేది తాజా వార్త.