ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ వస్తున్నారు. అయితే ఆయన హైదరాబాద్లో అడుగు పెట్టక ముందే సీఎం కేసీఆర్ సిటీ నుంచి వెళ్లిపోతున్నారు. పొరుగు రాష్ట్రంలో ఆయన రాజకీయ భేటీల కోసం వెళ్తున్నారు. జేడీఎస్ నేతలయిన దేవేగౌడ, కుమారస్వామిలతో కేసీఆర్ సమావేశం అవుతారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయంపై వారితో చర్చలు జరుపుతారు. గతంలోనూ ఓ సారి ఆయన సమావేశమయ్యారు. ఇప్పుడు మరోసారి వెళ్తున్నారు. అయితే కేసీఆర్ వెళ్తున్న టైమింగ్ పైనే చాలా చర్చలు జరుగుతున్నాయి.
ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నందున ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు సీఎం స్వాగతం చెప్పాలి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ కేసీఆర్ మాత్రం ఇటీవలి కాలంలో మోదీతో పాటు ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ఎదురుపడటం లేదు. అందుకే ఇప్పుడు మోదీ వస్తున్నా.. సిటీలో లేకుండా వెళ్తున్నారని చెబుతున్నారు. దేవేగౌడ, కుమారస్వామిలతో భేటీ కోసం నేరుగా ప్రధాని పర్యటనను స్కిప్ చేయడంపై సహజంగానే కేసీఆర్ విమర్శలు ఎదుర్కొంటారు. అయినా సరే కేసీఆర్ ఆయనకు ఎదురుపడకూడదని నిర్ణయించుకున్నారు.
కేసీఆర్, మోదీ మధ్య రాజకీయ విభేదాలు తీవ్రమయ్యాయని.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోదీతో భేటీ కోసం అంటూ కేసీఆర్ పలుమార్లు ఢిల్లీ వెళ్లారు కానీ భేటీ కాలేదు. ఇప్పుడు నేరుగా వస్తున్నా కలవడం లేదు. మోదీ తీరుపై అసంతృప్తిగా ఉన్న కేసీఆరే ఆయనను కలవడానికి ఇష్టపడటం లేదని చెబుతున్నారు. మొత్తంగా మోదీ తెలంగాణకు వస్తూంటే.. కేసీఆర్ మాత్రం కర్ణాటకకు వెళ్లిపోతున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఇప్పటికే సెటైర్లు ప్రారంభించారు .