తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్ 7నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలకు ఏర్పాటు చేసి.. కనీసం ఇరవై రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నారు. సిద్ధం కావాలని మంత్రులకు సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి. అయితే ిప్పుడు.. అన్లాక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. వచ్చే నెల మొదటికి పూర్తిగా అన్లాక్ చేసే అవకాశం ఉంది. దీంతో ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్లోనే నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కువ రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. పార్లమెంట్ సమావేశాలు కూడా అదే సమయంలో అటూ ఇటూగా జరుగుతూ ఉంటాయి. కరోనా అయినా.. మరో కారణం అయినా… వీటిని ఆపడానికి అవకాశం లేదు. ప్రత్యామ్నాయ పద్దతుల్నైనా ఎంచుకుని ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే.. కోవిడ్ నిబంధనల ప్రకారం… భౌతిక దూరం పాటిస్తూ.. సీటింగ్ ఏర్పాటు చేసి.. సమావేశాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్లో ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమయింది. ఇప్పుడు కేసీఆర్ కూడా.. ఏడో తేదీన ముహుర్తం పెట్టుకున్నారు.
ఏపీ ప్రభుత్వం కూడా.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాల్సి ఉంది. అయితే.. ఎప్పటి నుంచి నిర్వహించాలన్నదానిపై ఎలాంటి ఆలోచనలు ఇంకా వెల్లడించలేదు. కరోనా కారణంగా.. భౌతిక దూరం పాటిస్తూ.. నిర్వహించాల్సిన సమావేశాల కోసం.. చాలా ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించాల్సి ఉంటుంది. మరి ఏపీ సర్కార్ ఆలోచనలు ఎలా ఉన్నాయో..?