రెవెన్యూ శాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాల్లో ఒకటి. అత్యధికంగా అవినీతి ఆ శాఖలోనే జరుగుతోందని ఆయనే స్వయంగా వ్యాఖ్యానించిన సందర్భాలూ ఉన్నాయి. జీతం వస్తోంది చాలదా, అవినీతి సొమ్ము ఏం చేసుకుంటారు అంటూ ఈ మధ్య ఓ ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రే అన్నారు. రెవెన్యూ శాఖ విషయంలో కేసీఆర్ ఆలోచన ఎంత కఠినంగా ఉండబోతోందనే సంకేతాలు ఆయన ముందు నుంచీ ఇస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన కూడా తుదిదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. దీన్లో భాగంగా ఈనెల 11న కలెక్టర్లతో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారు.
కొత్త రెవెన్యూ చట్టం అమలు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ప్రభుత్వం ఒక అధ్యయనం చేసినట్టు సమాచారం. ఈ చట్టానికి తెలంగాణ భూచట్టం అని నామకరణం చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈనెలలో అసెంబ్లీ సమావేశాలున్నాయి. ఈలోగా కొత్త చట్టానికి తుది మెరుగులు దిద్ది, సభలో ఆమోదింపజేసుకోవాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. క్షేత్రస్థాయి రెవెన్యూ వ్యవస్థలోనే అత్యధికంగా అవినీతి జరుగుతోందనీ, దీన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని సీఎం భావిస్తున్నారట. క్షేత్రస్థాయిలో అధికారులతోపాటు ఇతరుల జోక్యం రెవెన్యూ వ్యవస్థలో ఉంటోందనీ, ఒక సామాన్యుడు భూములకు సంబంధించి ఏ చిన్న మార్పులూ చేర్పులూ చేయించుకోవాలన్నా లంచాలు ఇవ్వాల్సి వస్తోందనీ, ఈ పరిస్థితిని మార్చాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. వీఆర్వో, వి.ఆర్.ఎ.లు సేవలపై కూడా సీఎం అధ్యయనం చేస్తున్నారు. వీరిని కొనసాగించాలా, రద్దు చెయ్యాలా, వేరే ఏదైనా శాఖలో వీళ్లను విలీనం చేసి సేవల్ని వినియోగించుకోవచ్చా అనేది కూడా ఆలోచిస్తున్నారని సమాచారం.
భారీ మార్పులకు కేసీఆర్ సిద్ధమౌతున్నారన్నది అర్థమౌతోంది. రెవెన్యూ వ్యవస్థపై చాలా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి కాబట్టి, దీన్ని సమూలంగా మార్చడమే సరైన చికిత్స అనే అభిప్రాయంతో సీఎం ఉన్నారు. ఏకంగా కొన్ని శాఖలనే లేకుండా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికార వర్గాలూ అంటున్నాయి. అయితే, ఇంకోపక్క తమ ఉద్యోగాలు పోతాయనే ఆందోళన రెవెన్యూ ఉద్యోగుల నుంచి వ్యక్తమైన సంగతీ తెలిసిందే. ఈ కొత్త చట్టం కఠినంగా ఉండటం ఖాయమనే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టే అవకాశమూ లేకపోలేదు. చూడాలి మున్ముందు ఏమౌతుందో..?