జనాకర్షకంగా ప్రసంగాలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మించినవారు ఉండరు అనడంలో అతిశయోక్తి ఉండదు! మూడో విడత హరితహారంలో భాగంగా కరీంనగర్ లో కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మరో రెండేళ్ల తరువాత హెలీకాప్టర్ పై నుంచి కరీంనగర్ మీదుగా అలాఅలా వెళ్తుంటే… ఇక్కడో అడవి కనిపించాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంతమంతా ఆ స్థాయిలో పచ్చబడిపోవాలని, ఈ హరితహారం బాధ్యతను మహిళలు స్వీకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
గతంలో కరీంనగర్ కు వచ్చినప్పుడు చెప్పినట్టుగానే.. ఇప్పుడు కూడా ఓ అంశంపై హామీ ఇచ్చారు. ఇంతకీ గతంలో ఇచ్చిన హామీ ఏంటంటే.. కరీంనగర్ లో రోడ్లన్నీ లండన్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడి రహదారులన్నీ అద్దాల్లా మెరిసిపోతాయని అన్నారు. ఇప్పుడు కూడా అదే మాటను మళ్లీ చెప్పారు! కరీంనగర్ కు లండన్ స్థాయి సొగబులు అద్దుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. లండన్ నగరానికి థేమ్స్ నది పక్కనే ఉన్నట్టుగా, కరీంనగర్ కు మానేరు ఉందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఇటీవలే రూ. 500 కోట్లతో ఒక టూరిజం ప్రాజెక్టును కేటాయించామని సీఎం గుర్తు చేశారు. కరీంనగర్ లో రోడ్లన్నీ త్వరలోనే రూపు మారుతాయనీ, లండన్ నగరాన్ని తలపించేలా తయారు చేస్తామని చెప్పారు.
ఆ మధ్య జిల్లా పర్యటన సందర్భంగా లండన్ రోడ్ల హామీని కేసీఆర్ ఇచ్చారు కదా! ఆ సందర్భంలోనే చాలా విమర్శలు వినిపించాయి. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతలు కూడా ఈ లండన్ హామీపై ఎద్దేవా చేశారు. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు మరోసారి అదే హామీని కేసీఆర్ ఇవ్వడం విశేషం. అంతేకాదు.. ఈ సందర్భంగా ప్రతిపక్షాలను గొర్రెలు అంటూ విమర్శించారు! రాష్ట్రవ్యాప్తంగా తాము 84 లక్షల గొర్రెలు పంపిణీ చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే… ప్రతిపక్షాలకు చెందిన కొన్ని గొర్రెలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయన్నారు. ఒక గొర్రె చనిపోతే దాన్ని కూడా పెద్దదిగా చేసి కొంతమంది సన్నాసులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తానికి.. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మరోసారి గొర్రెలు, సన్నాసులు అని కేసీఆర్ విమర్శలు చేశారు. ఇదంతా ఓకేగానీ.. కరీంనగర్ లో లండన్ ను చూపిస్తానని మరోసారి చెప్పడమే కాస్త విడ్డూరంగా ఉందనేది కొంతమంది అభిప్రాయం! ఆ పట్టణాన్ని అభివృద్ధి చేయడాన్ని ఎవ్వరూ విమర్శంచరుగానీ, ఇలా ప్రపంచస్థాయి నగరాలతో పోలికలే.. కాస్త ఎక్కువ అనే ఫీలింగ్ కలుగుతుంది కదా.