తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కాబోతున్నారు. ఎన్నికలకు ముందు ఆయన చాలా పెద్ద కోరికల చిట్టాతోనే ఢిల్లీకి వచ్చారు. కేంద్రానికి తాము అన్ని విధాలుగా సహకరిస్తున్నామని… దానికి తగ్గట్లుగా ప్రతి సహకారం ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. ముఖ్యంగా ముస్లిం రిజర్వేషన్ల, కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం రక్షణ శాఖ స్థలం కేటాయించడం, వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ సహా.. అనేక డిమాండ్లు కేసీఆర్ .. మోడీ ముందు ఉంచనున్నారు. నిజానికి ఈ డిమాండ్లన్నీ చాలా రోజుల నుంచి ఉన్నవే. చేయగలిగే వాటిని కూడా కేంద్రం పట్టించుకోవడం లేదు.
గతంలో జరిగిన భేటీలకు.. ఈ భేటీకి చాలా తేడా ఉంది. ఆ తేడా పొగడ్తలు. కేసీఆర్‌ను లోక్‌సభలో… ఓ రేంజ్లో పొగిడారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కేసీఆర్‌కు దక్కిన పొగడ్తలు.. భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్యమంత్రులకు కూడా ఇంత వరకూ దక్కలేదు. సొంత పార్టీ సీఎంలను కూడా పొగడని స్థాయిలో కేసీఆర్‌ను మోడీ పొగిడారు. అదే సమయంలో.. మరో రాష్ట్ర సీఎం చంద్రబాబును కించపరిచారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఆయన చూపించిన తేడా మధ్య రాజకీయం ఉందని.. రాజకీయవర్గాలు మొదటి నుంచి చెబుతున్నాయి. కానీ మోదీ.. చేసిన విమర్శలు రాజకీయ పరంగా కాదు. పాలనా పరంగానే. అందుకే కేసీఆర్ పై ఇప్పుడు ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే.. పొగుడుతున్నారని.. లైట్ తీసుకుని.. తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు పెరగడమే కారణం.
గత నాలుగేళ్ల కాలంలో ఏపీ విభజన చట్టంలో ఉన్న వాటిని ఎంతో కొంత సాధించుకుంది. కానీ తెలంగాణ మాత్రం ఈ విషయంలో ఏమీ సాధించలేకపోయింది. కానీ విభజన చట్టంలో ఉన్నవి అమలు చేయాలనే డిమాండ్‌ను కూడా గట్టిగా వినిపించలేపోయారు. దానికి రాజకీయ కారణాలు ఉన్నాయేమో కానీ.. ఎన్నికలు ముందు ఇదే .. టీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితి తెచ్చి పెట్టింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకైనా.. నిధులు ఇవ్వాలని చాలా కాలంగా కేసీఆర్ కోరుతున్నా… కేంద్రం లైట్ తీసుకుంటోంది. ఢిల్లీలో ఆగిపోయిన తమ పనులలో కొద్దిగా అయినా సాధించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. మరి కేసీఆర్ సాధిస్తారా..? పొగడ్తలతో సరిపెట్టుకుంటారా.. ?