తెలంగాణ సీఎం కేసీఆర్ గురువును మార్చబోతున్నారు. వైష్ణవ స్వామి చినజీయర్‌ను దూరం పెట్టేసిన ఆయన ఇప్పుడు శైవం ఆచరించే శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామిని గురువుగా స్వీకరించబబోతున్నారు. యాదాద్రిని అద్భుతంగా నిర్మించానని ఇక దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ ఆలయాన్ని అభివృద్ది చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వేములవాడ అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనల కోసం కేసీఆర్ శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి వద్దకు వెళ్లనున్నారు.
శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శనం, ఆగమ నిర్దేశం మేరకు వేములవాడ పునర్నిర్మాణ ప్రక్రియ జరపాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆగమ సంబంధమైన సమస్యలు, ఆలయ సంబంధమైన ఇబ్బందులు లేకుండా పునర్నిర్మాణ బాధ్యత మొత్తాన్నీ శృంగేరీ జగద్గురువులకే అప్పగిస్తారనీ, పండితులు, శిల్పులంతా వారు సూచించిన మేరకే వస్తారనీ కేసీఆర్ సొంత మీడియా ప్రకటించేసింది. కేసీఆర్ వైష్ణవంపైనే దృష్టి పెట్టారనే ఆరోపణలు శైవుల నుంచి వచ్చాయి. వైష్ణవంతో పాటు శైవాన్ని ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగించాలన్నది కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తోంది.
నిజానికి వేములవాడ అభివృద్ధికి ఇప్పటికే కేసీఆర్ చాలాప్రకటనలుచేసారు. వేములవాడ ఆలయ అభివృద్దికి ఏటా రూ.వంద కోట్లు చొప్పున నాలుగేండ్లళ్లలో రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని 2015లోనే హామీ ఇచ్చారు. రూ. 400 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన 13 అంశాలతో కూడిన పనుల ప్రతిపాదనలను రూపొందించారు. కానీ ఎక్కడా మందుకు సాగలేదు. ఇప్పుడైనా ముందుకు సాగుతాయో..లేదో చూడాల్సి ఉంది.