తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి గెలిచిన ఉత్సాహంతో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… జాతీయ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పెట్టారు. కొత్త జాతీయ పార్టీ, జనతా మోడల్ అంటూ.. ఎన్ని పేర్లు పెట్టినా.. ముందుగా కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల మద్దతు కూడగట్టడం ముఖ్యం కాబట్టి.. ఆ దిశగా ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కార్యాచరణ ప్రారంభించబోతున్నారు. ముందుగా ఒడిషా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తో సమావేశం కానున్నారు. ఇందు కోసం ఆయన ఈ నెల ఇరవై మూడో తేదీన సాయంత్రం విశాఖ వెళ్లనున్నారు. విశాఖలో స్వరూపానంద శారదాపీఠాన్ని సందర్శిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. రాజయోగ యాగాన్ని స్వరూపానంద.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిర్వహించారు. కేసీఆర్ స్వయంగా రెండు రోజుల పాటు యాగంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ప్రచార సభలు ప్రారంభిచారు. ఈ కారణంగా స్వరూపానంద ఆశ్రమానికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంటారు. ఆ తర్వాత భువనేశ్వర్ వెళ్తారు. 23న సాయంత్రం ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌తో కేసీఆర్ సమావేశం అవుతారు. జాతీయ రాజకీయాలపై చర్చలు జరుపుతారు. నవీన్ పట్నాయక్ ఇప్పటికే పద్దెనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నారు. వరుసగా అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ.. ఆయన జాతీయ రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు. ఎప్పటికప్పుడు… కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉంటున్నారు. అలా అని మూడో కూటమి కోసం కూడా చురుగ్గా పని చేసిన దాఖలాలు లేవు. ఎంపీలు ఉన్నప్పటికీ.. జాతీయ రాజకీయాల జోలికి నవీన్ పట్నాయక్ పెద్దగా వెళ్లరు.
24న బెంగాల్ వెళ్తారు. సా.4 గంటలకు కోల్‌కతాలో మమతాబెనర్జీతో సమావేశం అవుతారు. గతంలో కూడా.. కేసీఆర్ .. బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీని కలిశారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉన్న ఆమె.. కొత్త కూటమి ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం ఉంది. దాంతో వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాలకు ఆసక్తి కలిగించేదే. 25 నుంచి రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్ ఉండనున్నారు. ఢిల్లీలో మాయావతి, అఖిలేష్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి.. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పర్యటనను.. టీడీపీ అధినేత చంద్రబాబు తేలిగ్గా తీసుకున్నారు. గందరగోళం సృష్టించేందుకే కేసీఆర్ పర్యటనలు ప్రారంభిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే మోదీ ఏపీకి రాబోతున్నారని .. కేంద్రంలో కూడా ఇంకా చాలా జరగబోతున్నాయని జోస్యం చెబుతున్నారు. ఏపీకి బీజేపీ సహకరించడం లేదు.. సహకరిస్తానన్న కాంగ్రెస్‌తో వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు.