తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేది తామే అంటూ భాజపా నేతలు చెబుతూ వస్తున్నారు. నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకున్న దగ్గర్నుంచీ పార్టీ విస్తరణ వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. అయితే, భాజపా తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రకాలుగా ఇన్నాళ్లూ డీల్ చేసుకుంటూ వచ్చారు. రాష్ట్ర స్థాయిలో భాజపా నేతల్ని విమర్శిస్తూ… జాతీయ స్థాయికి వచ్చేసరికి భాజపాకి మద్దతుగానే వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో రాష్ట్ర భాజపా నేతలకు కూడా తెరాసను ఎలా డీల్ చేయాలో అర్థం కాని పరిస్థితి. అయితే, ఈ మధ్య కేంద్రంతో ఢీ అంటే ఢీ అనేందుకు కేసీఆర్ సిద్ధమౌతున్నారు. ఇన్నాళ్లూ లోక్ సభలో భాజపా సర్కారు ఏ బిల్లు తీసుకొచ్చినా, ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించినా భాజపాకి వంతపాడుతూ వచ్చిన తెరాస… తాజాగా పౌరసత్వ బిల్లు దగ్గరకి వచ్చేసరికి కేంద్రంతో విభేదించింది. భాజపా నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటసారి.
పౌరసత్వ బిల్లును తెరాస వ్యతిరేకించడం వెనక కారణం.. ఇకపై భాజపాని తీవ్రంగా వ్యతిరేకిస్తామనే ప్రకటన చేయడంగా చూడొచ్చు. దీంతోపాటు, మరో కారణం ఏంటంటే… తెలంగాణలో 12 శాతం ముస్లింలు ఉన్నారు. మొదట్నుంచీ చూసుకుంటే ముస్లిం అనుకూల వైఖరిని కేసీఆర్ అనురిస్తున్నారు. ఎమ్.ఐ.ఎమ్.తో మంచి దోస్తీ ఉంది. కేంద్రం ఆమోదించిన తాజా బిల్లు ప్రకారం ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే పౌరసత్వం దక్కుతుంది. ముస్లిం శరణార్థులకు ఇవ్వరు. దీంతో సభలో ఈ బిల్లు కాపీని ఒవైసీ చించేసి వ్యతిరేకత వ్యక్తం చేశారు. కాబట్టి, ఇది ముస్లిం వ్యతిరేకంగా ఉందనే అభిప్రాయంతో ఈ బిల్లుకు కేసీఆర్ మద్దతు ఇవ్వకపోయి ఉండొచ్చు. ముస్లిం ఓటు బ్యాంకును జాగ్రత్తగా కాపాడుకోవాలన్నదీ వ్యూహం కావొచ్చు.
అయితే, ఇప్పుడు తెలంగాణలో భాజపాకి ఇదే సరైన విమర్శనాస్త్రం కాబోతోంది. తెలంగాణలో హిందువులను తెరాస సర్కారు పట్టించుకోవడం లేదనీ, హిందువుల ఓట్లతో కేసీఆర్ గెలవలేదా అంటూ భాజపా ఎంపీ డి. అరవింద్ విమర్శలు మొదలుపెట్టారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెరాస పార్టీని ముస్లిం లీగ్ లో కలపాలంటూ ఎద్దేవా చేశారు! నిజానికి, తెలంగాణలో భాజపాకి ఒక విస్తరణాయుధంగా హిందుత్వ టాపిక్ కావాలి. ఇప్పుడు సిటిజన్ షిప్ బిల్లు అంశంలో తెరాస ముస్లిం అనుకూలంగా కనిపిస్తోంది కాబట్టి, ఈ సందర్భంలో హిందు వ్యతిరేక ముద్రను తెరాస మీద వెయ్యొచ్చనే వ్యూహంతో భాజపా సిద్ధమౌతోందనేది అరవింద్ వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. దీన్ని తిప్పి కొట్టేందుకు కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.