ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా దానిలో భారీతనం ఉంటుంది. బహిరంగ సభలు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అయితే, ఈ మధ్య ఆయన భారీ బహిరంగ సభలేవీ నిర్వహించలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో కూడా ఆయన పాల్గొనలేదు. అట్టహాసంగా ఏదో ఒక ప్రభుత్వ పథకాన్నీ ప్రారంభించింది లేదు. కానీ, త్వరలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో ఈ సభ ఎక్కడ జరుగుతుందనేది వెల్లడిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. సభ కోసం కొంగరకొలాన్ ప్రాంతాన్ని పార్టీ నేతలు ఇప్పటికే సందర్శించి వచ్చినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. సభా ప్రాంగణం ఎక్కడా అనే స్పష్టతా త్వరలోనే ఇవ్వనున్నారు.
ఇంతకీ ఈ భారీ బహిరంగ సభ అజెండా ఏంటంటే…. పార్టీకి చెందిన దాదాపు 40 వేల మంది నాయకులు ఒక చోటకి రావాలనేది! వీరందరికీ కొత్త మున్సిపల్ చట్టం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించబోతున్నారని సమాచారం. దీంతోపాటు కొత్త రెవెన్యూ చట్టం గురించి కూడా సీఎం మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. సభకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు ఇలా అన్ని స్థాయిల నేతలూ హాజరౌతారని తెలుస్తోంది. కొత్త మున్సిపల్ చట్టం చాలా కఠినంగా ఉండబోతోందనీ, ప్రజా ప్రతినిధులు ఎవ్వరు తప్పు చేసినా కఠినంగా చర్యలు ఉంటాయంటూ ఇప్పటికే మంత్రి కేటీఆర్ పదేపదే చెబుతూ వస్తున్నారు. అవినీతిలో నంబర్ వన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందని ముఖ్యమంత్రే ఈ మధ్య వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా… ఎవ్వరు అవినీతికి పాల్పడినా భరించేది లేదనే సందేశం ఇచ్చే అవకాశం ఉంది.
కొత్త చట్టాల గురించి నాయకులకు వివరించడానికి ఇంత భారీ బహిరంగ సభ అవసరమా అంటే… వాస్తవానికి అవసరం లేదనే చెప్పాలి. కానీ, అవినీతిని సహించం అనే సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ సభ ఉపయోగపడుతుంది. తెలంగాణలో తమ నాయకగణం ఇదిగో ఇంత ఉంది అనే ప్రదర్శనకు కూడా ఈ సభను వాడుకునే అవకాశం ఉంది. ఎలాగూ జాతీయ రాజకీయాలంటూ మళ్లీ కేసీఆర్ కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా! ఈ నేపథ్యంలో తన బలం బలగం ఇదీ అనే ఇతర రాష్ట్రాలు గుర్తించే స్థాయిలో సభను నిర్వహించబోతున్నారనీ భావించొచ్చు.