“మానవత్వం మారు పేరు కేసిఆరు.. మళ్లీ గెలిచి రావాలి మనసుగల్ల సర్కారు” … ఇది టీఆర్ఎస్…. ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడానికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందిన ఆరు పాటల్లోని ఓ పాట పల్లవి. దీన్ని చూస్తే.. కరుడు గట్టిన టీఆర్ఎస్ వారి.. కేసీఆర్ భక్తులు ఎవరో రాసి ఉంటారని.. అనుకోవడం సహజం. కానీ దీన్ని రాసింది అలాంటి వాళ్లు కాదు. అంతకు మించి డబ్బులు తీసుకుని ఇలా డబ్బాలు కొట్టే.. సినీ రచయితలవి కూడా కాదు. అచ్చంగా.. ఆ పల్లవితో.. స్వయంగా కేసీఆరే ఆ పాట రాసుకున్నారు. వినేవాళ్లు సెల్ఫ్ డబ్బా అని అనుకోనియడి… చదువుకునేవాళ్లు..స్వయం సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటున్నారా.. అని అనుకోనీయండి.. కేసీఆర్ మాత్రం… స్వయంగా రెండు పాటలు రాసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆ పాటల్ని హోరెత్తించబోతున్నారు.
మాటలు చెప్పడంలో ఘనాపాటి అయిన కేసీఆర్.. పాటలు కూడా రాస్తారు. ఈ సారి ఎన్నికల్లో తన సాహిత్య ప్రతిభను కూడా ఉపయోగిస్తున్నారు. తెలంగాణలో జరిగిన ప్రగతి, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు వాటి అమల అమలు, విపక్షాల కుట్రలు అన్ని కలగలిపి రెండు పాటలు రాశారు. వీటితో పాటు సుద్ధాల అశోక్ తేజ, మిట్టపల్లి సురేందర్, గోరెటి వెంకన్న రాసిన గీతాలకు కూడా కేసిఆర్ కొంత మెరుగులు దిద్దారు. ఎన్నికల పాటల కోసం.. కేసీఆర్ చాలా పెద్ద కసరత్తే చేశారు. గీతాల రూపకల్పనకు వర్క్ షాప్ నిర్వహించారు.ఇందులో 12 గీతాలను ఎంపిక చేశారు. ఫైనల్ గా కేసిఆర్ రాసిన రెండు పాటలతో మొత్తం 6 పాటలను సీడి గా రూపొందించి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారు. ఈ పాటల్లో ఎలాంటి అభ్యంతరకమైన అంశాలు, పదాలు లేవని నిబంధనలమేరకు ఉన్నాయని వాటికి ఎన్నికల సంఘం ఆమోదం కూడా తెలిపింది.
ఉద్యమ సమయంలో కేసిఆర్ అనేక పాటలను, కవితలను రాశారు. 2006 కరీంనగర్ లోక్ సభ ఉపఎన్నిక సందర్భంగా రాసిన “పుడితె ఒకటి సత్తె రెండు రాజిగ ఓ రాజిగ.. ఎత్తుకొ తెలంగాణ జెండా రాజిగ ఓ రాజిగ” అనే పాట అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత 2009లో జై బోలో తెలంగాణ సినమాకు “గారడి జేస్తుండ్రు.. గడబిడ చేస్తుండ్రు” అనే పాట కూడా రాశారు. ముందస్తు ఎన్నికల కోసం కేసిఆర్ దాదాపుగా అన్ని నియోజకవర్గాలను చుట్టి రావాలని భావిస్తున్నారు. ఈ సభల్లో ఈ పాటలను ప్రముఖంగా పాడాలని కళాకారులను ఆదేశించారు. తన మాటలతో పాటు ఈ పాటలు హైలెట్ కావాలని చెబుతున్నారు