తెలంగాణ రాష్ట్ర పద్దును సీఎం కేసీఆర్ మళ్లీ తగ్గిస్తున్నారు. ఈ సారి కరోనా కారణం. గత ఆర్థిక సంవత్సరంలోనూ బడ్జెట్‌ను కేసీఆర్ భారీగా తగ్గించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయం తగ్గిపోయిందని కారణం చెప్పారు. అయితే.. మార్చిలో కాస్త తగ్గినా.. ఓ రేంజ్ బడ్జెట్‌నే ప్రవేశ పెట్టారు. కానీ కరోనా కారణంగా ఇప్పుడు… మళ్లీ మొత్తం బడ్జెట్‌ను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలు గడిచిపోయాయి. కానీ ఆదాయం అంచనాలకు అందలేదు. కేంద్రం నుంచి వస్తాయనుకున్న నిధులూ రాలేదు. ఆదాయం ఇప్పుడు కాస్త పెరిగినా… బడ్జెట్ అంచనాలు అందుకునే పరిస్థితి లేదని అధికారవర్గాలు అంచనాకు వచ్చాయి.
2020-21వ ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను రూ. 1.82 లక్షల కోట్లుగా అంచనా వేసి, అసెంబ్లీలో ఆమోదించారు. ఏడు నెలల కాలంలోరూ. 60 వేల కోట్ల నిధుల వరకు మాత్రమే వ్యయం చేసినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం కేసీఆర్.. బడ్జెట్‌ను రివైజ్ చేయాలని ఆర్థిక శాఖ అధికారుల్ని ఆదేశించారు. వాస్తవంగాప్రభుత్వానికి ఎన్ని నిధులు అందుబాటులో ఉంటాయో.. ఏ ఏ శాఖకు ఎంత ఎంత కేటాయించవచ్చో నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పుడు అధికారులు ఆ పని మీదే ఉన్నారు.
ఎంత ఆదాయం పెరిగినా.. ఎన్ని అప్పులు చేసినా… బడ్జెట్లో అంచనా వేసిన విధంగా రూ. 1.82 లక్షల కోట్ల నిధులను ఈ ఏడాదిలో వ్యయం చేసే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే వివిధ శాఖలకు కేటాయించిన మొత్తంలో పెద్ద ఎత్తున కోత పెట్టే అవకాశం కనిపిస్తోంది. దుబ్బాక ఉపఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ అంశంపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రాధాన్య రంగాలు తప్ప.. ఇతర ఖర్చులను తగ్గించుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.