పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా.. అసెంబ్లీకి మాత్రం.. డిసెంబర్లో ఎన్నికలు పెట్టేయాలన్నంత దూకుడుగా ఉన్నారు.. తెలంగాణం సీఎం కేసీఆర్. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ… గురువారమే… ఉత్తరప్రదేశ్‌లో భారీ బహిరంగసభతో… ముందస్తు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ రోజు ఆ బాధ్యత కేసీఆర్ తీసుకుంటున్నారు. గద్వాలలో భారీ బహిరంగసభ ద్వారా.. ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. అందుకే ఒక్క రోజు ముందుగా కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆర్ ఈ రోజు పాత పాలమూరు జిల్లాలో గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత గద్వాలలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభను సక్సెస్ చేసే బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారు. సాధారణంగా.. ఎన్నికల సభల బాధ్యతలను మాత్రమే.. హరీష్ రావుకు కేసీఆర్ అప్పగిస్తారు. దీంతో గద్వాల సభను.. ముందస్తు ఎన్నికల ప్రచారభేరీగా టీఆర్ఎస్ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. కొద్ది రోజుల నుంచి కేసీఆర్… ముందస్తు ఎన్నికల సూచనలు ఇస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ పై స్థాయి నుంచి కింది క్యాడర్ వరకూ అందరూ డిసెంబర్ ఎన్నికలకు మానసికంగా సిద్ధమయ్యారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి దక్షిణతెలంగాణ నుంచి కేసీఆర్ ప్రచారభేరీ మోగించడం.. టీఆర్ఎస్ వర్గాల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ ఇప్పటికీ బలంగా ఉంది. ఆ పార్టీకి ఉన్న బలమైన నేతలంతా.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నారు. డీకే అరుణ, జైపాల్ రెడ్డి,రేవంత్ రెడ్డి, చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి లాంటి బలమైన నేతలు కాంగ్రెస్‌కు ఉన్నారు. వీరిలో ఒకరితో ఒకరికి ఒకరితో ఒకరి సరిపడకపోయినా… ఎవరి నియోజకవర్గాల్లో వారు బలమైన నాయకులే. టీఆర్ఎస్ను నేరుగా సవాల్ చేయగలిగేవాళ్లే.
పైగా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే దక్షిణ తెలంగాణపై కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారనే ప్రచారాన్ని చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో డీకే అరుణ ఇదే వాదనతో పోరాటం చేశారు. రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు విమర్శలు చేశారు. కొద్ది రోజుల క్రితం కల్వకుర్తి ఎమ్మెల్యే.. వంశీచంద్ రెడ్డి ప్రత్యేక రాష్ట్రం కోసం మరో ఉద్యమం వస్తుందన్న హెచ్చరికలు కూడా చేశారు వీటన్నింటికీ చెక్ పెట్టేలా కేసీఆర్.. దక్షిణ తెలంగాణలో సత్తా నిరూపించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.