తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… మళ్లీ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. మే 23 తర్వాత ఢిల్లీలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని.. గట్టిగా నమ్ముతున్న ఆయన.. ప్రాంతీయ పార్టీలన్నింటినీ .. తన నేతృత్వంలోని కూటమిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు.. కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచే.. ఈ సారి టూర్లు ప్రారంభం కానున్నాయని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు,చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు… కేసీఆర్ వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎన్నికలు ముగిసిన రాష్ట్రాలకు వెళ్లే ఆలోచన కేసీఆర్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. పైగా.. ఫెడరల్ ఫ్రంట్లో ఆయనతో పాటు కచ్చితంగా ఉంటారని నమ్మకం పెట్టుకున్న మిత్రుడు .. జగన్మోహన్ రెడ్డి. ఆయన కోసం కేసీఆర్.. చాలా చేశారు. ఆయన కచ్చితంగా గెలుస్తారని.. మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటారన్న నమ్మకంతో ఉన్నారు. వైసీపీ, టీఆర్ఎస్ ఎంపీలు కలిస్దే.. నలభై వరకూ ఉంటాయని… వాటికి మరో అరవై జత చేసి.. ఢిల్లీలో చక్రం తిప్పాలని ఆయన చాలా రోజులుగా ప్లాన్లు రెడీ చేసుకుంటున్నారు. ఎన్నికల బహిరంగసభల్లోనూ అదే చెప్పారు. ఈ మేరకు.. ఇప్పుడు.. ఆయన ఏపీకి వచ్చి.. విజయవాడలో.. వైసీపీ కార్యాలయంలో..జగన్మోహన్ రెడ్డితో సమావేశమై.. కూటమి ఏర్పాటు గురించి ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన తమిళనాడు వెళ్లి.. డీఎంకే నేతలతో … కర్ణాటక వెళ్లి జేడీఎస్ నేతలతో.. సమావేశమవుతారని భావిస్తున్నారు. అయితే.. డీఎంకే, జేడీఎస్ రెండు పార్టీలు కాంగ్రెస్తో పొత్తులో ఉన్నాయి. మరి భేటీకి అంగీకరిస్తారో లేదో క్లారిటీ లేదు.
నిజానికి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ టూర్లు ఇప్పటికి రెండు విడతలుగా జరిగాయి. రెండు సార్లు… పలువురిని కలిశారు. కానీ ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. రెండో సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపులో…ఎస్పీ, బీఎస్పీ అధినేతలతో సమావేశమవుదామని ప్రయత్నించినా… వారు పట్టించుకోలేదు. దాంతో… వెనక్కి వచ్చేశారు. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల నుంచి తన ఫెడరల్ ప్రయత్నాలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికైతే ఆయనకు ఏపీలో మాత్రమే నమ్మకమైన మిత్రుడు కనిపిస్తున్నారు.