కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలవడంపై బీఆర్ఎస్ నేతలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా మంది మాటల్లో దక్షిణాది అనే మాట వినిపించింది. దక్షిణాదిలో బీజేపీకి చోటు లేదని ప్రజలు నిరూపించారని వారు చెప్పుకొచ్చారు. ఓ వరుస ప్రకారం దక్షిణాదిని హైలెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రకటనలతో .. భారత్ రాష్ట్ర సమితి రాజకీయంలో కేసీఆర్ తరచూ చెప్పే గుణాత్మక మార్పు కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది. ఆ గుణాత్మక మార్పు దక్షిణాది ఉద్యమమే.
ప్రాంతీయ ఉద్యమాల్లో కేసీఆర్ అపరచాణక్యుడు
కేసీఆర్ ప్రాంతీయ ఉద్యమాల్లో దిట్ట. ఆయన ఉమ్మడి రాష్ట్రం విడగొట్టడం సాధ్యం కాదని వంద కు వందశాతం అనుకుంటున్న దశలో తెలంగాణ రాష్ట్ర సమితిపెట్టి చివరికి అనేక రకాల వ్యూహాలతో తెలంగాణ సాధించారు. ఇప్పుడు దేశ రాజకీయాలకు వెళ్లాలనుకుంటున్న ఆయన దక్షిణాది ఉద్యమం చేపట్టే అవకాశాలపై పరిశీలన చేస్తున్నారని అందుకే.. కొత్తగా దక్షిణాది అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రకటులు చేస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాల గురించి కనీస అవగాహన ఉన్న ఎవరైనా ఈ అంశాలను కొట్టి పారేయలేరు.
వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడంలో కేసీఆర్ దిట్ట
ఏదైనా ఓ రాజకీయ పరిణామం జరిగినప్పుడు తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ సిద్దహస్తులు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారని తెలిసిన తర్వాత ఆయన రకరకాలుగా తొక్కిపెట్టిన తెలంగాణ ఉద్యమాన్ని ఒక్క ఆమరణ దీక్షతో రోజుల్లోనే ఉద్యమ స్థాయికి చేర్చిన ప్లాన్లు ఆయన సొంంత. అంత వేగంగా అవకాశాలను అంది పుచ్చుకునే కేసీఆర్ ఇప్పుడు కర్ణాటక ఫలితాల తర్వాత తన బీఆర్ఎస్ పార్టీని దక్షిణాది ఉద్యమంవైపు మళ్లించే అవకాశాలున్నాయన్న సంకేతాలు అందేలా చేశారు.
ప్రత్యేక దక్షిణాది ఉద్యమాన్ని అందుకుంటారా ?
దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపిస్తోందని కేసీఆర్ చాలా సార్లు ఆరోపించారు. అనేక లెక్కలు వెల్లడించారు. దక్షిణాది విషయంలో కేంద్రం తీసుకునే కొన్ని నిర్ణయాలు వచ్చే కొద్ది రోజుల్లో వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జనాభాను బట్టి ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు, జనాభాను బట్టి పార్లమెంట్ సీట్ల నిర్ణయం వల్ల దక్షిణాది తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇది దక్షిణాది మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి అవకాశం ఉంది. కేసీఆర్ వీటిపై ముందు ముందు వర్కవుట్ చేసే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ నేతల స్పందనతో అర్థం చేసుకోవచ్చంటున్నారు.