తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలను స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకే.. ఈ విజయ ఉత్సాహం.. అప్పటి వరకూ కొనసాగించేందుకు విభిన్నమైన వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. వరుసగా ఎన్నికలు నిర్వహించి.. హవా చాటుకోవడం ద్వారా… ఈల లక్ష్యం సాధించాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ముందుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికలను జనవరి 15లోగా నిర్వహించాలని ఇంతకుముందే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ ఫలితాలు వెల్లడవ్వగానే తమ ముందున్న మొదటి లక్ష్యం-పంచాయతీ ఎన్నికలు అని కేసీఆర్ ప్రకటించారుకూడా.
అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించినందున స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమకు ఎదురుండదని టీఆర్ఎస్ భావిస్తోంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, మంత్రి వర్గ విస్తరణ పూర్తి కాగానే పంచాయతీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ దృష్టి పెట్టనుంది. గతంలో తెలంగాణలో 8వేల 684 పంచాయతీలు ఉండేవి. అయితే తండాలను పంచాయతీలుగా గుర్తించడంతో 12751కు చేరాయి. పంచాయతీ అయిపోయిగానే.. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలను కూడా.. పూర్తి చేసే అవకాశం ఉంది. గతంలో 2014 ఎన్నికలకు ముందే… అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు ముందే జరిగిపోయాయి కాబట్టి.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇవి జరగాల్సి ఉంది.
గ్రామాల్లో , పట్టణాల్లో పూర్తి పట్టు ఉందని నిరూపించుకుని.. లోక్‌సభ ఎన్నికలకూ సిద్ధమవ్వాలని, ఇప్పుడున్న ఊపునే కొనసాగించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఎంపీ స్థానాలపై కూడా.. దాదాపుగా క్లారిటీ ఇచ్చారు. ఒకటి , రెండు తప్ప.. అన్ని సీట్లూ సిట్టింగ్‌లకే ఇస్తామని ప్రకటించారు. చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ తాండూరు నుంచి పోటీ చేసి ఓడిన పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. విశ్వేశ్వర్ రెడ్డికి మహేందర్ రెడ్డినే కరెక్ట్ అని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. మల్కాజిగి స్థానం కోసం గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఎంపీ మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. పెద్దపల్లి నుంచి వివేక్‌ను బరిలోకి దింపుతారు. అక్కడి ఎంపీ సుమన్.. ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ రాజకీయ లక్ష్యంతో స్పష్టంగానే ముందడుగు వేస్తున్నారు.