పార్టీ కార్యాలయం శంకుస్థాపన కోసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే తిరిగి వస్తారని అనుకున్నారు. కానీ ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేవరకూ అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ల కోసం సీఎంవో అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు హోంమంత్రి ఆఫీసుతో కోఆర్డినేట్ చేసకుంటున్నారు. ఒకటి .. రెండు రోజుల్లో అపాయింట్మెంట్ దొరికే చాన్స్ ఉండటంతో కేసీఆర్ అక్కడే ఉండాలనుకుంటున్నారు.
ఈ లోపున ఆయన కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్తోనూ సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కరించలేని సమస్యగా కృష్ణా జలాల వివాదం ఉంది. తెలుగు రాష్ట్రాలు రెండూ పదే పదే ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఈ అంశంపై కేంద్రమంత్రితో మాట్లాడాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అలాగే ప్రధాని, హోంమంత్రులతోనూ ఆయన తెలంగాణరాష్ట్ర సమస్యలే కాకుండా రాజకీయ అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. గతంో బీజేపీపై యుద్ధమే అని ప్రకటించిన కేసీఆర్ గ్రేటర్లో అనుకున్నన్ని ఫలితాలు రాకపోవడంతో వెంటనే ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ అయ్యారు.
ఆ తర్వాత రాజకీయం మారిపోయింది. ఆ తర్వాత మళ్లీ కేంద్ర పెద్దల్ని కేసీఆర్ కలవలేదు. ఇప్పుడే ఆయన ఢిల్లీకి వెళ్లారు. జాతీయ స్థాయిలో ప్రస్తుతం రాజకీయాల పునరేకీకరణ జరుగుతోంది. బీజేపీ అనుకూల.. బీజేపీ వ్యతిరేకం అనే రెండు వర్గాలుగా పార్టీలు మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ ఢిల్లీ టూర్లో కీలకమైన రాజకీయ అంశాలు కూడా చర్చిస్తున్నట్లుగా కనిపిస్తోంది.