కోల్పోయిన ప్రజా మద్దతును కూడగట్టుకోవడానికి కేసీఆర్ చేస్తున్న అనేకానేక ప్రయత్నాల్లో ఎల్ఆర్ఎస్ కూడా చేరింది. లే ఔట్ రెగ్యూలరైజేషన్ స్కీమ్ ద్వారా.. ఖాళీ ప్లాట్ల ఓనర్ల నుండి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. కనీసం రూ. ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసుకున్నారు. స్కీమ్‌కు భారీగా ఆదరణ కూడా కనిపించింది. తర్వాత రిజిస్ట్రేషన్లు చేయరేమో అన్న భయంతో పాతిక లక్షలకు మందికిపైగా ఎల్ఆర్ఎస్ కట్టారు. వారంతా ప్రాథమిక ఫీజు కట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం.. ముందు చెల్లించాలి. కానీ అది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణం అయింది. ఈ విషయం ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు లీకులు ఇచ్చాయి.
ఎల్ఆర్ఎస్ పోవాలంటే.. టీఆర్ఎస్ పోవాలన్న నినాదాన్ని ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో విపక్షాలు ఉపయోగించాయి. ముందు ముందు ఇదే పెద్ద నినాదం అయ్యే ప్రమాదం ఉంది. ప్రజల వద్ద నుంచి ఇరవై వేల కోట్లు వసూలు చేయడం అంటే..చిన్న విషయం కాదు. అంత మొత్తం చెల్లించేవారు.. ప్రభుత్వంపై ఆగ్రహం పెంచుకోకుండా.. ఉండరు. అలాంటి పరిస్థితి ముందు ముందు తీవ్రంగా ఉంటుందన్న నివేదికలు రావడంతో.. కేసీఆర్ ఇప్పుడు.. ఆ ఎల్ఆర్ఎస్ నుంచి బయటకు రావాలని చూస్తున్నారు.
ఇప్పటి వరకూ కట్టిన రుసుముతో .. ఉచితంగా క్రమబద్దీకరణ చేయాలని ఆలోచిస్తున్నారు. అలా లేకపోతే.. కనీసంగా రూ. పదివేలు కట్టించుకుని మిగతా మొత్తాన్ని రద్దు చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు.. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఊరట కల్పించి.. మళ్లీ వారి మద్దతు పొందాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ఇలా ఓ సమస్యను.. తీవ్ర స్థాయికి తీసుకెళ్లి.. చివరికి ఒక్క ఉదుటున పరిష్కరించేస్తారు. దాంతో.. ఆయనకు పాలాభిషేకాలు జరుగుతాయి. గతంలో అనేక సార్లు జరిగింది. ఇప్పుడు కూడా.. అదే జరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.