తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతుల్ని నిండా ముంచాయి. ఈ సారి వడగళ్ల వానలు దంచికొట్టాయి. రెండు రాష్ట్రాల్లోనూ సమానంగా రైతులు నష్టపోయారు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విధానాల్లో మాత్రం తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అకాల వర్షాలు పడినప్పటి నుండి బాధిత ప్రాంతాల్లో తెలంగాణ మంత్రులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రైతులకు భరోసా ఇస్తున్నారు. ఆదుకుంటామని రైతులకు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు వస్తూండటంతో ఎంతో కొంత ఆదుకుంటారని రైతులు కూడా నమ్మకంతో ఉన్నారు.
ఇప్పుడు నేరుగా కేసీఆరే పర్యటనకు వెళ్తున్నారు. ఇటీవలి కాలలో ఇలా ఆయన పర్యటనకు వెళ్లడం రెండో సారి. గతంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు వెళ్లారు. మళ్లీ ఈసారి పెద్ద ఎత్తున పంట నష్టం జరగడంతో రైతులకు భారీ సాయం ప్రకటించే ఉద్దేశంతో ఆయన మూడు జిల్లాల్లో ఒకే సారి పర్యటించనున్నారు. మరో వైపు ఏపీలో మాత్రం అసలు పట్టించుకునే వారే లేరు. వ్యవసాయ మంత్రికి బదులు అంబటి రాంబాబు ఓ ప్రెస్ మీట్ పెట్టి రైతుల్ని ఆదుకుటామన్నారు. నష్టం అంచనా వివరాల్ని నమోదు చేస్తామన్నారు.
నిజానికి గత నాలుగేళ్లుగా ఎన్ని విపత్తులు వచ్చినా రైతుల్ని ఆదుకున్న వారు లేరు. భరోసా ఇచ్చిన వారు కూడా లేరు. పంటల బీమాను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు. అన్నమయ్య లాంటి డ్యామ్లు కొట్టుకుపోయినా పట్టించుకున్న వారులేరు. అందుకే రైతులు పూర్తిగా రుణఊబిలో చిక్కుకున్నారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొలాల్లో బురదలోకి దిగి రైతుల్ని పరామర్శించేవారు. ఎకరాలకు యాభై వేలు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు ఐదు వేలు కూడా ఇవ్వడం లేదు. సరి కదా కనీసం పరామర్శించడం లేదు.
ఇన్ పుట్ సబ్సిడీ పేరుతో రైతులకు వంద నుంచి వెయ్యి వరకూ సాయం చేస్తున్నారు. అదీ కూడా అందరికీ అందడంలేదు. తెలంగాణ ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడానికి పరుగులు పెడుతూంటే.. ఏపీ ప్రభుత్వం గాలికొదిలేసింది.