తెలంగాణ ముఖ్యమంత్రి తొమ్మిది నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి… అభివృద్ధి ఆగిపోకూడదనే ఆ నిర్ణయం తీసుకున్నాననే విచిత్ర వాదన వినిపిస్తున్నారు. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిహోదాలో ఉన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవి అనేది రాజ్యాంగంలో లేదు. కావున ప్రభుత్వం ఉన్నా .. లేనట్లే…! ఓ సారి అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత.. రాష్ట్రపతి పాలన రాకుండా.. ఉండటానికి ఓ వెసులుబాటు మాత్రమే ఆపద్ధర్మ ప్రభుత్వం. ప్రభుత్వం ఏ చిన్న అధికారిని బదిలీ చేసినా అది అనైతికమే. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఆపద్ధర్మ ప్రభుత్వంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం … ఆపద్ధర్మం కాదు.. ధర్మమే అంటూ మీడియా కథనాలు రాయిస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో అలాంటి కథనమే వచ్చింది.
అనుకున్నదానికంటే ముందుగా ఎన్నికలకు పోవాలన్న నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ధర్మబద్ధ ముఖ్యమంత్రే కాని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదని అని ఓ ఆర్టికల్లో స్పష్టంగా వాదన వినిపించారు. అభివృద్ధి ఉద్యమాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం పేరుతో ఆపకూడదని కూడా అందులో తేల్చారు. ఆర్థికపరమైన, విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదన్న ఆంక్షలు వుండడానికి వీల్లేదని కూడా స్పష్టం చేశారు. అభివృద్ధి నమూనాగా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి వున్న పేరు అలాగే కొనసాగడానికి ఆపద్ధర్మ ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉండాల్సిందేనని ఆర్టికల్లో తేల్చి చెప్పారు. అదే సమయంలో… ప్రభుత్వానికి ఐఆర్… మధ్యంతర భృతి ప్రకటించడానికి అన్ని అధికారాలు ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం వినిపిస్తున్న వాదన.. ఉద్యోగుల డిమాండ్ చూస్తూంటే.. కేసీఆర్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో కూడా అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం తెలంగాణలో ప్రారంభమయింది. మెజారిటీ శాసనసభ సభ్యుల మద్దతు వుండి, పూర్తికాలం అధికారంలో వుండడానికి అవకాశం వుండి .. ప్రభుత్వాని ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా… అసెంబ్లీని రద్దు చేసేశారు. ఇంకా తొమ్మిది నెలల కాలంలో.. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ అసెంబ్లీని రద్దు చేసి.. ఇప్పుడు లేని అధికారాల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారన్నది ప్రధానమైన ప్రశ్నగా మారుతోంది. కేసీఆర్ తీరుపై అనుమానాలు రావడంతో విపక్షాలన్నీ గవర్నర్కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నాయి. కానీ కేసీఆర్ అనుకోవాలే కానీ..ఈ ఫిర్యాదులను గవర్నర్ పట్టించుకుంటారా..?