లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమౌతున్నారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజక వర్గాలను కలుపుతూ ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. రెండు లోక్ సభ నియోజక వర్గాలకు ఒకటి చొప్పున, మొత్తంగా ఎనిమిది భారీ బహిరంగ సభలకు సీఎం సిద్ధమౌతున్నారు. ప్రతీ సభకీ కనీసం 2 లక్షల మందికి తగ్గకుండా జన సమీకరణ జరగాలనీ, ఆ బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలపై పెట్టినట్టు తెరాస వర్గాలు చెబుతున్నాయి. ఇక, కేసీఆర్ సభలు అంటే ప్రసంగాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సెంటిమెంట్ ని బాగా వాడుకున్నారు. టీడీపీ తెలంగాణలో పోటీ చేయడంతో… ఆంధ్రా పార్టీ అని ముద్రవేసి, ఆంధ్రుల పాలన మనకు అవసరమా అనే నినాదంతో బాగానే లబ్ధి పొందారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కూడా అంతకంటే భిన్నంగా కేసీఆర్ ప్రచార వ్యూహం ఉండకపోవచ్చు అనిపిస్తోంది.
కేంద్రంలో మనమే చక్రం తిప్పుతామనీ, అన్ని ఎంపీ స్థానాలు మనమే గెలిస్తే… కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాబోతామని కేసీఆర్ ప్రచారం చేస్తారు. ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటును ప్రముఖంగా ప్రస్థావిస్తారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన కేటీఆర్ అదే పనిలో ఉన్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిస్తే, ప్రధానిని మనమే నిర్ణయిస్తామన్న స్థాయిలో ఆయన చెప్పుకుంటూ పోతున్నారు. దీంతోపాటు, కేసీఆర్ సభల్లో తెలుగుదేశం ప్రస్థావన మళ్లీ ఉండే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ మధ్య డాటా చోరీ వివాదానికి హైదరాబాద్ కేంద్రం కావడం, తెలంగాణ సర్కారుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేస్తుండటం చూస్తున్నాం. వీటిపై సీఎం కేసీఆర్ ఇంతవరకూ మాట్లాడలేదు. అంటే, ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా ఆయన వాడుకునే అవకాశం కనిపిస్తోంది.
ఎలాగూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా మాట సాయం చెయ్యాలి కాబట్టి, పనిలోపనిగా టీడీపీని లక్ష్యంగా చేసుకునే ప్రచార సభల్లో కేసీఆర్ విమర్శల దాడి కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మరోసారి తెలంగాణలో సెంటిమెంట్ కలిసి రావాలీ, ఆంధ్రాలో జగన్ కి కొంత మేలు జరగాలి కాబట్టి… ఈసారి కూడా టీడీపీ లక్ష్యంగానే కేసీఆర్ ప్రచార కార్యక్రమాలు ప్రముఖంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.