తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రం బెంగళూరు బయలుదేరి వెళ్లారు! అంటే, రేపు కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమార స్వామి ప్రమాణం స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు రెండు పార్టీలూ సన్నాహాలు చేస్తున్నాయి. దీన్లో భాగంగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను కూడా కుమార స్వామి ఆహ్వానించారు. సో… దీంతో కేసీఆర్ ఇవాళ్ల బయలుదేరి వెళ్లారు. అంటే, రేపటి ప్రమాణ స్వీకారానికి ఉంటారని అనుకునేరు..! కానే కాదు. ముఖ్యమంత్రి కాబోతున్న కుమారస్వామికి కృతజ్ఞతలు చెప్పేసి.. వెంటనే తిరుగు ప్రయాణమౌతారట! బుధవారం నాడు హైదరాబాద్ లో కొన్ని అత్యవసర సమావేశాలున్నాయనీ, అందుకే కుమార స్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకే, ఒక రోజు ముందుగానే కర్ణాటక వెళ్లి, శుభాకాంక్షలు చెప్పేసి.. ఈ రాత్రికే మళ్లీ హైదరాబాద్ వచ్చేస్తారన్నమాట!
మొత్తానికి, విమర్శల నుంచి కేసీఆర్ భలేగా తప్పించుకున్నారు కదా! కుమార స్వామి ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులూ… యూపీయే భాగస్వామ్య పక్షాలు కూడా రాబోతున్నాయి. ఈ కార్యక్రమానికి రేపు వెళ్తే… ఆ పార్టీల నేతల మధ్య కేసీఆర్ కూడా కూర్చోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నేతలతో వేదికను పంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే… రాష్ట్రంలో విమర్శలు తప్పవు కదా! అందుకే, కుమార స్వామి ఆహ్వానంపై కూడా తీవ్ర తర్జనభర్జన అనంతరం బెంగళూరుకు వెళ్దామని నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు మధ్యే మార్గంగా ఒకరోజు ముందే వెళ్లి వచ్చేస్తున్నారు. అంటే, దీంతో జేడీఎస్ తో చెలిమిని కాపాడుకున్నట్టూ అవుతుంది, కాంగ్రెస్ పార్టీతో ఒకే వేదికపైకి రావాల్సిన అవసరమూ తప్పుతుంది కదా! కానీ, అసలు సమస్య ఉండనే ఉంది. కాంగ్రెసేతర, భాజపాయేతర ఫ్రెంట్ ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పిన దేవెగౌడ, ఇప్పుడు కాంగ్రెస్ తో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇదే స్నేహం కొనసాగుతుందన్న సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్ కు కొత్త మిత్రుడు ఝలక్ ఇచ్చినట్టే లెక్క.