తెలంగాణ సీఎం కేసీఆర్ అక్ోబర్లో విజయవాడలో పర్యటించే అవకాశం ఉంది. కమ్యూనిస్టుల మద్దతు కోసం.. ఆ పార్టీతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్న కేసీఆర్.. తమ పార్టీ జాతీయ మహాసభల్లో పాల్గొనాలని వారు కోరడంతోనే అంగీకరించారు. అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు జరుగనున్నాయి. పదహారో తేదీన బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలను పిలిచి.. సభ నిర్వహించాలనుకుంటున్నారు. బెంగాల్ సీఎంను పిలవలేరు. వారు తప్ప మిగతా సీఎలంను పిలుస్తున్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీకి చెందిన సీఎం ఒక్కరే ఉన్నారు. కేరళ సీఎం విజయన్ తో పాటు ఇతర ముఖ్యమంత్రులు హాజరవుతారు.
ఇటీవల మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లుగా సీపీఐ ప్రకటించింది. ఆ సమయంలో జాతీయ స్థాయిలోనూ కలిసి పని చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అందుకే కేసీఆర్ తప్పని సరిగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయితే విజయవాడ పర్యటనకు వస్తున్నకేసీఆర్ జగన్రెడ్డితో భేటీ అవుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ ప్రారంభమయింది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్కు సత్సంబంధాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ని ఆహ్వానించేందుకు స్వయంగా విజయవాడ వచ్చారు
విజయవాడ పర్యటనలో కేసీఆర్ .. ఏపీ సీఎం జగన్తో సమావేశం అయ్యే చాన్స్ ఉందా లేదా అన్నది అప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయమయ్యే అవకాశం ఉంది. ఏపీలో కమ్యూనిస్టులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అందుకే ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చి.. జగన్తో సమావేశం అవడం బాగుండదని చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీతో తీవ్రంగా విభేదిస్తున్న కేసీఆర్ తో బహింగంగా భేటీ అయితే బీజేపీకి కోపం వస్తుందేమో అన్న ఆందోళన కూడా సహజంగా వైసీపీలో ఉంటుంది. అందుకే భేటీ జరగకపోవచ్చని చెబుతున్నారు.