తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నికల మిషన్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎంత మంది వస్తే అంత మందిని పార్టీలో చేర్చుకుంటున్నారు. కానీ ప్రతి నిర్ణయం వెనుక దళిత కోణం చూసుకుంటున్నారు. హూజూరాబాద్‌లో ఉన్న దళితులు ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్కు ఓటు వేయరని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారిని ఇంప్రెస్ చేయడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో ఇంటికి రూ. పది లక్షలు పంచడం దగ్గర్నుంచి పదవులు కూడా ఆ నియోజకవర్గానికే ఇస్తున్నారు. తాజాగా.. బండా శ్రీనివాస్ అనే హుజూరాబాద్ నియోజకవర్గ నేతకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ప్రకటించేశారు.
కేసీఆర్ నిర్ణయాలను విశ్లేషిస్తున్న వారికి దళితులపై… ఆయనకు ఆందోళనగా ఉన్నట్లుగా ఉందని.. అందుకే… వారికి మాత్రమే పెద్ద ఎత్తున వరాలు ప్రకటిస్తున్నారని అంచనా వేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో .. మొత్తంగా నలభై వేలమందికిపైగా దళిత ఓటర్లు ఉన్నారు. వారిలో అత్యధికులు మాదిగ సామాజికవర్గానికి చెందినవారు. దశాబ్దాలుగా ఈటల రాజేందర్ అక్కడే రాజకీయం చేయడం కారణం కావొచ్చు.. అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా వారికి అండగా ఉండటం కావొచ్చు… దళితుల్లో ఈటల రాజేందర్‌కు పలుకుబడి ఉంది. ఆయనను టీఆర్ఎస్ను బయటకు పంపేసిన తర్వాత కూడా వారు ఆయన వైపే ఉన్నారన్న సర్వే నివేదికలు కేసీఆర్‌కు అందినట్లుగా చెబుతున్నారు.
ఇప్పుడు.. ఆ దళితులను ఈటలకు దూరం చేసి.. టీఆర్ఎస్కు దగ్గర చేస్తేనే అనుకూల ఫలితం వస్తుందని లేకపోతే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు . అందుకే… దళితుల్ని ఆకట్టుకునేందుకు రోజుకో అంశం ప్రకటిస్తున్నారని అంటున్నారు. ఇంటికో రూ. పది లక్షల పథకం… ఎన్నికలకు ముందుగానే మెటీరియలైజ్ అయితే.. ఓట్ల వర్షం కురుస్తుందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఏదైనా.. హుజూరాబాద్ దళితులపై వరాలు.. ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదు. ఎన్నికలయ్యే వరకూ కురిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.