ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం శంకుస్థాపనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ అక్కడ ప్రధానమంత్రితో భే్టీకి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పీఎంవో నుంచి సానుకూల సంకేతాలు ఉండటంతో కలిసే అవకాశం ఉందన్న సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారు. ఆయన పార్టీ కార్యక్రమం కోసం వెళ్లారని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అవరని ఇప్పటి వరకూ టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. కానీ ఆయన పర్యటనలో జాతీయ రాజకీయ కోణం కూడా ఉందని తాజా పరిణామాలతో పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగాజాతీయ రాజకీయాల్లోనే ఉండాలని అనుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాలు ఎప్పటి నుండో అంచనా వేస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల తర్వాతే ఆ వ్యూహం అమలు చేయాలనుకున్నారు కానీ.. ఫలితాలు అనుకున్న విధంగా రాకపోవడం… ఢిల్లీలో చేయడానికి పనేమీ ఉండదని తేలడంతో పాటు బీజేపీకి ఇప్పటికిప్పుడు ఎదురెళ్లే పరిస్థితి లేకపోవడంతో వ్యూహం మార్చుకున్నారు. కానీ ఈ సారి మాత్రం అలా ఉండదని… టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నారు. బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా ఏమీ లేదనుకుంటే ఆయన నేరుగా ఎన్డీఏలోనూ చేరినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం ఇంతకు ముందు నుంచే ఉంది .
తెలంగాణలోనూ కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్లో మెరుగైన ఫలితం వస్తే కేసీఆర్ వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారన్న అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది. ఇలా ఎన్నికలకు వెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి. లేకపోతే సాధ్యం కాదు. గతంలో గ్రేటర్ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడంతో ఆయన నేరుగా తర్వాతి రోజే ప్రధానితో భేటీ అయి రాజకీయాన్ని మార్చేశారు. ఇప్పుడు ప్రధానితో భేటీ అంటూ జరిగితే మరింత మార్పు ఖాయమని అంచనా వేయవచ్చు.