తెలంగాణ సీఎం కేసీఆర్ తాను వదిలేసిన సెంటిమెంట్ అస్త్రం కోసం పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ఏదో జరిగిపోయిందంటూ బీఆర్ఎస్ కొద్ది రోజులుగా హడావుడి చేస్తోంది. ఈ క్రమంలో నల్లగొండలో బహిరంగసభకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో ప్రాజెక్టుల అంశంతో ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ రేపి.. పార్టీని బతికించుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయానని.. ఇక తెలంగాణకు ఒక్క చుక్క నీరు రాదన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణ ఎగువ రాష్ట్రం.. ముందు ఇక్కడ ప్రాజెక్టులు నిండితేనే దిగువకు వదులు తారు అన్న విషయాన్ని గుర్తు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ప్రాజెక్టుల్లో నీటి వాటాలపై గతంలో కేసీఆర్ సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు నీటిని కేటాయిస్తున్నారు. అయినా తెలంగాణకు అన్యాయం జరిగిపోయిందని దానికి కాంగ్రెస్సే కారణమని బహిరంగసభ పెడుతున్నారు కేసీఆర్. ఈ విషయాలన్నింటినీ కాంగ్రెస్ అసెంబ్లీలో వివరించింది.
నల్లగొండలో కేసీఆర్ నిర్వహించే బహిరంగసభ పార్లమెంట్ ఎన్నికల ప్రచార భేరీకి ప్రారంభసభ. దాన్ని ప్రాజెక్టుల సభగా చేసి.. తన పాత అస్త్రం తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ పొందాలనుకుంటున్నారు. తెలంగాణ అంటే కేసీఆర్.. తనను కాదని వేరే పార్టీని ప్రజలు ఎన్నుకోరన్న నమ్మకంతో .. పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. చివరికి తెలంగాణలో గ్రౌండ్ కోల్పోవడంతో సర్వం కోల్పోయినట్లయింది. ఇప్పుడు మళ్లీ మూలలకు వచ్చి .. తన ఆయుధాన్ని వెదుక్కుంటున్నారు.
ఇప్పుడు మళ్లీ కేసీఆర్ చెప్పే మాటల్ని విని ప్రజలు భావోద్వేగానికి గురవుతారా లేదా అన్నదానిపైనే ఆయన రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది. నిజానికి కేసీఆర్ ఓడిపోయి రెండు నెలలు కూడా కాలేదు. ఈ లోపే తెలంగాణకు ఏదో జరిగిపోతోందని ప్రజల్ని నమ్మించడం అంత తేలిక కాదు. కానీ కేసీఆర్ కు మరో ఆప్షన్ లేదు. అందుకే ప్రయత్నాలు చేస్తున్నారు.