గ్రేటర్ ఎన్నికలకు ముందు వరకూ భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడి.. ఆ పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేస్తానన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పుడు వ్యూహం మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది ఆయన భారతీయ జనతా పార్టీతో మునపటి సంబంధాలను మెరుగుపర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. అవసరం లేకపోయినా.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పేరుతో మోడీని గొప్పగా పొగిడేస్తూ లేఖ రాసిన కేసీఆర్.. ఒక్క రోజులోనే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. మోడీతో భేటీ కోసం అపాయింట్మెంట్ అడిగినట్లుగా తెలుస్తోంది. మోడీ ఇస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. కానీ…కేసీఆర్ మాత్రం… భారతీయ జనతా పార్టీతో గతంలో ఉన్నంతగా ఉండకపోవచ్చని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయన్న చర్చ మాత్రం ఢిల్లీలో సాగుతోంది.
కేసీఆర్ ప్రో బీజేపీ స్టాండ్ తీసుకుంటున్నారా..!?
వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కేసీఆర్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అంతలోనే ఇతర అంశాలపై పొగడ్తలు కురిపించడం చాలా మందిని ఆశ్చర్య పరిచినా.. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం కాబట్టి… ఇది కూడా అలాంటిదే అని అనుకోవడం ప్రారంభించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనూ.. బీజేపీ ప్రత్యామ్నాయ శక్తి గురించి మాట్లాడారు. జాతీయ స్థాయిలో… హైదరాబాద్‌లో బీజేపీ వ్యతిరేక కూటమి సభను నిర్వహిస్తానని ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాల తర్వాత కేసీఆర్ వైపు నుంచి ఈ అంశంపై పెద్దగా స్పందన రావడం లేదు. కానీ బీజేపీకి పొగడ్తలు మాత్రం వెళ్తున్నాయి.
చంద్రబాబు అనుభవంతో జాగ్రత్త పడుతున్నారా..?
భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటే… చంద్రబాబు లాంటి పరిస్థితులే వస్తాయని కొద్ది రోజులుగా ఆయనకు వివిధ వర్గాల నుంచి హెచ్చరికలతో కూడిన సూచనలు వెళ్తున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ కూడా.. కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఇంచుమించుగా బెంగాల్ లాంటి పరిస్థితులే తెలంగాణలో ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బీజేపీతో మరింతగా విరోధం పెంచుకోవడం కన్నా.. ఏదో విధంగా మునుపటి సంబంధాలు కొనసాగిస్తే బెటరన్న చర్చకు కేసీఆర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో.. బీజేపీ నేతలు.. కేసీఆర్ అవినీతి గురించి.. గట్టిగా మాట్లాడుతున్నారు. కోర్టుల ద్వారానే కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తామని చెబుతున్నారు. అన్ని పరిస్థితుల్ని బేరీజు వేసుకుని కేసీఆర్.. బీజేపీతో తాడో పేడో అన్నట్లుగా కాకుండా.. రాజకీయంగా సన్నిహిత సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా భావించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఇప్పుడు బీజేపీ పాత స్నేహాన్ని గుర్తు చేసుకునే చాన్స్ ఉందా..!?
నిజానికి బీజేపీతో గత ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ పెద్దలు సంపూర్ణంగా సహకరించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి కేసీఆర్.. బీజేపీ కన్నా కాంగ్రెస్సే బెటరన్న సంకేతాలు పంపారు. అదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీకి.. ఇతర చిన్న పార్టీలకు.. తెలంగాణ నుంచి ఆర్థిక సాయం అందిందన్న ప్రచారం కూడా జరిగింది. ఈ కారణాలతో బీజేపీతో సంబంధాలు తెగిపోయాయి. అప్పట్నుంచే బీజేపీ ఎదగడం ప్రారంభమయింది. ఇప్పుడు బీజేపీ సవాల్‌గా మారింది. అయితే.. అంది వచ్చే అవకాశం ఎదురుగా ఉన్న సమయంలో కేసీఆర్ ఆఫర్ చేసే మిత్రుత్వాన్ని ..మోడీ, షాలు అంగీకరిస్తారా లేదా అన్నది కీలకం.,