ఆర్టీసీతో చర్చలు జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం రాత్రి రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ తోపాటు పలువురు అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. బంద్ జరుగుతోందని బస్సులు ఆపొద్దనీ, డిపోల్లో ఉన్న వంద శాతం బస్సుల్ని నడిపేలా చూడాలంటూ అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రతీ బస్సుకీ ఇద్దరు కానిస్టేబుల్స్ చొప్పున భద్రతకు పంపించాలన్నారు. బస్సులను అడ్డుకున్నా, దుకాణదారులకు ఇబ్బంది కలిగించినా వెంటనే అరెస్టులు చేయాలని చెప్పినట్టూ తెలుస్తోంది. ఓపక్క సమ్మె చేస్తూ బంద్ కి పిలుపునిచ్చిన కార్మిక సంఘాలతో చర్చలా అంటూ సీఎం వ్యాఖ్యానించినట్టు సమాచారం. వారు సమ్మె విరమిస్తేనే చర్చలుంటాయని అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తోంది. బంద్ ప్రభావం ప్రజల మీద పడకూడదనీ, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ చెయ్యాలన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశంపై కోర్టు తమని తప్పుబడట్టడం లేదని అధికారులతో సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనీ, సమ్మె ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా లేదని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. గడచిన రెండు మూడు రోజులుగా దాదాపు 95 శాతం బస్సుల్ని నడుపుతున్నామన్నారు. వెంటనే సమ్మె విరమిస్తేనే 48 వేల మంది కార్మికుల గురించి ఆలోచిద్దామనీ, అంతవరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనే దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా సమాచారం.
ఇవాళ్ల జరుగుతున్న రాష్ట్రబంద్ ను సమర్థంగా అడ్డుకోవాలనేదే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ఆర్టీసీకి ప్రజల మద్దతు లేదు అనేది నిరూపించడమే సీఎం వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, వాస్తవ పరిస్థితులు గమనిస్తే… ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి మొండి వైఖరిపై చాలా విమర్శలే వచ్చాయి. ఆ కోణంలో సీఎం ఆలోచిస్తున్నట్టు లేరు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం, బస్సులన్నీ తిరుగుతున్నాయి కదా అనే ధోరణిలోనే కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వేరు, ప్రజల రవాణా అవసరాలు వేరు అన్నట్టుగా చూస్తున్నారు. కానీ, కార్మికులకు ఈ సమ్మె సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలూ, ఇతర సంఘాల మద్దతుగా నిలుస్తున్నాయంటే… ఆ మేరకే అదే ప్రజాభిప్రాయంగానూ చూడాలి కదా! ఏదేమైనా, ఆయన వైఖరి చూస్తుంటే… ఇవాళ్ల ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరుపుతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.