హీరో కృష్ణ సమర్పణలో కీ.శే. ప్రభాకరరెడ్డి నిర్మించిన ‘పండంటి కాపురం’ 45 ఏళ్ల కిందటి సూపర్ డూపర్ ఫ్యామిలీ హిట్. కలెక్టర్ జానకితో అప్పటికే గంభీరమైన ముద్ర వేసిన జమున ఈ చిత్రంలో రాణీ మాలినిదేవిగా నటించారు. తన ఫ్యాక్టరీలో కార్మికులు సంఘనాయకుడు గుమ్మడి నాయకత్వాన సమ్మె చేస్తే జీతాలు భత్యాలు అన్నీ బాగా పెంచుతాను గాని ఆ నాయకుడు మాత్రం వుండకూడదని షరతు పెడుతుంది మాలినీదేవి. ఎందుకు అంటే లదో ఫ్లాష్‌బ్యాక్. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తరచూ ఆ పాత్రను గుర్తు చేస్తున్నారు. మొన్న అంగన్వాడీ, నిన్న కాంట్రాక్టు లెక్చరర్లు, తర్వాత ఆశాలు అందరికి జీతాలు బాగాే పెంచారు. ఇందుకోసం వారిని తన నివాసమైన ప్రగతిభవన్‌కు రప్పించి అభిమానంగా మాట్లాడారు. వారి కృషిని పాత్రను గౌరవిస్తున్నట్టు చెప్పి సంతోషం కలిగించారు.అంగన్వాడీలకు పదవేలపైన, ఆశాలకు 6 వేలపైన జీతాలు పెంచడం అసాధారణమే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువే. ఈ మేరకు వారినుంచి నిర్దిష్ట బాధ్యతల నిర్వహణ కూడా ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు ఇదంతా బాగానే వుంది. కాని లేనిదేమంటే ఆ ఉద్యోగినులను సంఘటిత పరిచి ఒక శక్తిగా తీర్చిదిద్దిన యూనియన్ల నేతలకుు మాత్రం అధికారికంగా పాత్ర కల్పించరు. ఉద్యోగులతో నేరుగా మాట్లాడి జీతాలు పెంచడం వల్ల ప్రభుత్వ పాత్ర తన పాత్ర ప్రత్యక్షంగా అర్థమవుతుందని రాజకీయంగా లాభం కలుగుతుందని ఆయన వ్యూహం కావచ్చు. యూనియన్లతో అధికారులో మంత్రులో మాట్లాడి పెంచితే అప్పుడు అది వారి ఘనతగా వుంటుందని కూడా ఆయన అభ్యంతరం.నిజానికి గతంలోనే హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి వంటి మంత్రులు ఇతరులు కూడా కెసిఆర్‌కే నేరుగా చెప్పుకుంటే పెంచుతారు గాని మధ్యలో యూనియన్లు ఉద్యమాలు ఎందుకన్నట్టు మాట్లాడుతూ వస్తున్నారు. యూనియన్లు అత్యధిక భాగం కమ్యూనిస్టుల ఆధ్వర్వంలో వుండటం కూడా టిెఆర్ఎస్కు మింగుడుపడదు.అందుకే ఒకో తరగతి ఉద్యోగులను తీసుకొచ్చి కెసిఆర్ ముందు కూచోబెట్టి ప్రకటించడం, తర్వాత ఆయన చిత్రాలకు ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు ఒక తంతుగా జరిగిపోతున్నది.విషయమేమంటే నేరుగా ముఖ్యమంత్రులే మాట్లాడకపోయినా ఉద్యోగులు ఆయన పేరే చెప్పుకుంటారు. ఇప్పటికి ఇందిరాగాంధీ ఎన్టీఆర్ వైఎస్ఆర్ వంటి వారి పేర్లు చెప్పుకుంటున్నారంటే అదే కారణం. ఇప్పుడు అధికారంలో వున్న వారు ఎప్పుడూ ఒకే విధంగా వుండరు. ఎప్పుడూ ఒకరే వుండరు కూడా. అలాటప్పుదు కార్మికులు ఉద్యోగులకు వారికంటా సంఘం నిర్మాణం వుండాలి గాని కేవలం కెసిఆర్ ఔదార్యం పైనే ఆధారపడమంటే ఎలా?