వ్యవసాయ చట్టాలకు కేసీఆర్ నేరుగా మద్దతు ప్రకటించడమే మిగిలింది. ఆ చట్టాల వల్ల మేలు జరుగుతుందన్న సందేశాన్ని హఠాత్తుగా ఆదివారం ప్రజలకు పంపారు. అంతే కాదు.. ఆ చట్టాలను ఉపయోగించుకుంటూ.. ఇక గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను కూడా ఎత్తివేయాలని నిర్ణయించారు. దీంతో… ఆ చట్టాలను అమలు చేయడం ఖాయమయింది. ఇక అధికారికంగా మద్దతు ప్రకటించడమే మిగిలింది. గ్రేటర్ ఎన్నికలకు ముందు ఆయన… వ్యవసాయ చట్టాలపై యుద్ధమే ప్రకటించారు. అయితే.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ.. టీఆర్ఎస్కు పోటీగా ఎదగడంతో రూటు మార్చాలని నిర్ణయించుకున్నారు. రెండు వారాల ఫామ్ హౌస్ విశ్రాంతి తర్వాత… ఆయన చేసిన మొదటి సమీక్షలోనే ఆ విషయం స్పష్టమయింది.
నిజానికి వ్యవసాయ చట్టాలపై తెలంగాణలో పెద్ద చర్చ జరగలేదు. కేంద్ర చట్టాలు తమపై ప్రభావం చూపుతాయని తెలంగాణ రైతులు కూడా అనుకోలేదు. అందుకే ఎవరూ ఆ చట్టాలపై ఆందోళనలు చేయలేదు. కానీ.. బీజేపీపై యుద్ధానికి ఆ చట్టాలే అస్త్రాలన్నట్లుగా కేసీఆర్ అందుకున్నారు. ఇక్కడ రైతుల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించకపోయినా.. ఉత్తరాదిలో తీవ్ర వ్యతిరేకత ఉందని.. జాతీయ స్థాయిలో రైతుల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి.. జాతీయ నేతగా మారొచ్చన్న ప్లాన్ చేశారు. కానీ మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో కేసీఆర్… ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా తన వైఖరి మార్చేసుకుంటున్నారు.
కేసీఆర్ వ్యవసాయ చట్టాలపై ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన వ్యక్తం చేయకుండా.. ఇప్పుడు.. అనుకూలంగా మాట్లాడి ఉంటే.. ప్రజల్లో పెద్దగా రియాక్షన్ వచ్చేది కాదు. కానీ ఆయన ఆ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించి… యుద్ధం చేస్తామన్నట్లుగా మాట్లాడి.. ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకునే పరిస్థితికి రావడం… ఆయన ఇమేజ్ ప్రజల్లో మరింత దిగజారిపోయేలా చేయడం ఖాయం. ఆయన బీజేపీకి లొంగిపోయారన్న ప్రచారం ఇక ఉద్ధృతంగా సాగుతుంది. అది ఆయన రాజకీయ పయనానికి కూడా మేలు చేయదు. తప్పో ఒప్పో..ఆయన తన విధానానికి కట్టుబడి ముందుకు వెళ్తేనే.. ప్రజల్లో కాస్త ఇమేజ్ గట్టి పడే అవకాశం ఉంది. అయితే.. కేసీఆర్ ఇప్పుడు నేరుగా వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ ఎలాంటి ప్రకటనలు చేస్తారు.. ఎలా మంచివని ప్రజలకు చెబుతారో… అన్నదానిపైనే అంతటా ఆసక్తి కనిపిస్తోంది.