తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం అసెంబ్లీలో సంచలన ప్రకటన చేయబోతున్నారు. కేసీఆర్ అంటే.. అంచనాలకు మించి చేస్తారన్న మార్క్ ఉంది. నిర్లక్ష్యం చేసి.. చేసి.. చివరికి ఒక్క సారిగా వరాల జల్లు కురిపిస్తారు. అది ఆయన స్ట్రాటజీ. ఆర్టీసీ ఉద్యోగల సమ్మెతో పాటు అన్ని అంశాల్లోనూ అదే జరిగింది. అందుకే ఇప్పుడు నిరుద్యోగులు అంతే అంచనాలు పెంచుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ చాలా కాలంగా త్వరలో అనే ప్రకటన చేస్తున్నారు కానీ ఇంత వరకూ ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదు. అందుకే ఇప్పుడు ఒక్క సారే లక్ష ఉద్యోగాలను భర్తీ చేసి.. సంచలన ప్రకటన చేస్తారన్న భావన ఎక్కువ మందిలో వస్తోంది.
తెలంగాణలో నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు కూడా అంగీకరిస్తారు. ఇటీవలి కాలంలో పలువురు నిరుద్యోగులు నోటిఫికేషన్లు రావడం లేదని సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యాయి. కేసీఆర్ ఇప్పుడు నిరుద్యోగుల అసంతృప్తిని చల్లార్చాలంటే.. వారి అంచనాలకు తగ్గట్లుగా ఉద్యోగ ప్రకటనలు చేయాల్సి ఉంటుంది. వనపర్తిలో కేసీఆర్ ఇచ్చిన టీజర్ చూస్తే.. ఉద్యోగాల భర్తీ ప్రకటన బాహుబలిలా ఉంటుందని నిరుద్యోగులు నమ్ముతున్నారు.
అలా కాకుండా కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ది చేశామో… ఎంత మందికి ఉద్యోగాలిచ్చామో.., ఎన్ని లక్షల మందికి ప్రైవేటులో ఉపాధి కల్పించామో లెక్కలుచెబితే మాత్రం అంచనాలు తేలిపోతాయి. అదే సమయంలో అతి తక్కువ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ప్రకటించినా అసంతృప్తి డబుల్ అవుతుంది. అందుకే కేసీఆర్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని.. ఆ అంచనాలను అసలు ప్రకటన సమయంలో అందుకోవాలని నిరుద్యోగులు కోరుకుటున్నారు. టీఆర్ఎస్ వర్గాలూ కోరుకుంటున్నాయి. లేకపోతే ఏం జరుగుతుందో.. టీఆర్ఎస్కు.. కేసీఆర్కు.. తెలియనిదేం కాదు..!