అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చివరికి పద్మశ్రీలు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహించారు. మొన్నటి ఢిల్లీ పర్యటనలో మోడీ, షాలతో గొడవ పడ్డానని కూడా ప్రకటించారు. ఇక కేంద్రంతో గలాటానేనని తేల్చి చెప్పారు. కేసీఆర్ ఈ ప్రకటన చేసింది రాజకీయ బహిరంగసభలో కాదు నేరుగా అసెంబ్లీలోనే. ఇలా చెప్పారంటే సహజంగానే చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. కానీ ఎందుకనో కేసీఆర్ చెప్పిన మాటల్ని ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. చివరికి మీడియా కూడా లైట్ తీసుకుంది. కేసీఆర్ ఏంటి.. కేంద్రంలో లడాయి ఏంటీ అనేపద్దతిలో అందరూ కేసీఆర్ మాటలను లైట్ తీసుకున్నారు.
గ్రేటర్ ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ ఇలాంటి ప్రకటనలే చేశారు. గ్రేటర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక జాతీయ స్థాయిలో సమరమేనని ప్రకటించారు. అప్పట్లో ఆయన ప్రకటనలకు జాతీయ స్థాయిలో మీడియా ప్రాధాన్యత ఇచ్చింది. ప్రాంతీయ పార్టీల సమావేశాలు పెడతారని కూడా ప్రకటించారు. అయితే ఎన్నికల తర్వతా సీన్ మారిపోయింది. నేరుగా మోడీ, షాలతో భేటీ అయిన వాతావరణం చల్లబరిచేశారు. అప్పట్నుంచి అదే పరిస్థితి ఉంది.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ వరుసగా అమిత్ షాతో రెండు రోజులు గంటన్నర పాటు చర్చలు జరిపారు . అయితే రాష్ట్రం కోసం అని కానీ.. పద్మశ్రీ అవార్డుల కోసం అని భేటీలు అని కానీ ఎక్కడా చెప్పలేదు. అయితే యూపీ ఎన్నికల వ్యూహంలో బీజేపీకి కేసీఆర్ సహకరిస్తున్నారన్న ప్రచారం మాత్రం ఢిల్లీలో జరుగుతోంది. అక్కడ బీజేపీతో అలా ఉంటూ.. ఇక్కడ అసెంబ్లీలో బీజేపీపై పోరాటమే అంటే ఆ ప్రకటనల్లో సీరియస్ నెస్నూ ఎవరూ చూడలేకపోతున్నారు.