కరోనా కట్టడి విషయంలో తెలంగాణ హైకోర్టు పదే పదే ఘాటు వ్యాఖ్యలు చేస్తూండటంపై సీఎం కేసీఆర్ అసంతృప్తికి గురయ్యారు. అయితే న్యాయవ్యవస్థతో ఎలా వ్యవహరించాలో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి.. భిన్నమైన మార్గంలో ఆ అసంతృప్తిని మీడియాకు ప్రెస్‌నోట్ రూపంలో విడుదల చేశారు. అందులో కోర్టు గౌరవాన్ని ఎక్కడా భంగపరచకుండానే.. కోర్టు తీరు వల్ల… తమకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో వివరించారు. సీఎం కేసీఆర్… కొత్త సచివాలయ భవన నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. ఆ సమయంలో… కరోనా కట్టడి విషయంలో హైకోర్టులో జరుగుతున్న విచారణ.. ధర్మాసనం చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. లోపల ఏం చర్చ జరిగిందో కానీ.. ప్రెస్‌నోట్ రూపంలో మాత్రం.. మీడియాకు అందిన సమాచారంలో.. మాత్రం ప్రభుత్వ అసంతృప్తి స్పష్టంగా కనిపించింది.
హైకోర్టు అదే పనిగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించడం… ఏమిటన్న అభిప్రాయం ఆ ప్రెస్‌నోట్‌లో ప్రభుత్వం వ్యక్తం చేసింది. 87 పిల్స్‌ను హైకోర్టు స్వీకరించిందని… ఎవరో.. మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలనే పిల్ వేశారని .. ఆ విషయంలో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు కొట్టేసిందని ప్రభుత్వం గుర్తు చేసింది. కరోనా వ్యాప్తి నిరోధానికి యంత్రాంగం అంతా రేయింబవళ్లు పని చేస్తున్నా… విచారణ పేరుతో.. అధికారులు నిత్యం విచారణ హాజరు కావడం భారంగా మారిందన్నారు. అంతే కాదు.. నిత్యం.. విధుల్లో తీరిక లేకుండా ఉండే అధికారుల్ని అదే పనిగా కోర్టుకు రమ్మని పిలవడం ఇబ్బందిగా ఉందని .. వారి సమయం కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది.
క్లిష్ట సమయంలో చేయాల్సిన పనిని వదిలిపెట్టి కోర్టుకు తిరగడం వల్ల కరోనా కట్టడి చర్యలకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నామని అధికారులు ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అధికారుల ఆవేదన అంతా విన్న సీఎం.. వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించే విషయంలో, వైద్యం అందించే విషయంలో, తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో పూర్తి వాస్తవాలను హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సూచించారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా.. ఈ ప్రెస్‌నోట్‌ను మీడియాకు విడుదల చేసిందని అనుకోవచ్చు. తాము శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నా.. హైకోర్టుపదే పదే జోక్యం చేసుకుని అడ్డుకుంటుందన్న అభిప్రాయం… పరోక్షంగా కల్పించేలా.. ఈ ప్రెస్‌నోట్ ఉందన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో ఉంది.