తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ” టీం టీఆర్ఎస్ ” ఎంపికలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జిల్లాల అధ్యక్షుల్ని నియమించారు. అత్యధికంగా ఎమ్మెల్యేలకే చాన్సిచ్చారు. ఇప్పుడు రాష్ట్ర కమిటీపై కసరత్తు చేస్తున్నారు. రేపో మాపో ప్రకటించనున్నారు. ఇందులోనూ ఎంపీలు, ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక సీనియర్ నేతలకు మాత్రమే అవకాశం కల్పించనున్నారని తెలంగాణ భవన్లో గట్టి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పేర్లు ఖరారయ్యాయని అధికారిక ప్రకటనే మిగిలిందని అంటున్నారు.
మాములుగా అయితే పార్టీలో ప్రాధాన్యం దక్కని సీనియర్లకు పార్టీ పదవులు ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ కేసీఆర్ అదే పద్దతి ఫాలో అయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో 67 మంది ఉన్నారు. వీరిలో సగం మంది అప్పజెప్పిన పని కూడా సరిగ్గా చేయడం లేదన్న అసంతృప్తిలో కేసీఆర్ ఉన్నట్ులగా తెలుస్తోంది. సంస్థాగత ఎన్నికల నిర్వహణ విషయం కూడా పట్టించుకోలేని నివేదికలు తెప్పించుకున్నారు. చాలా మంది మీడియా చర్చలకు పరిమితమవుతున్నారు. దీంతో మూల మార్పు చేయాలని కేసీఆర్ డిసైడయ్యారు.
పార్టీ కార్యవర్గంలో ఎక్కవ మంది ఈ సారి కొత్త వారే ఉండే అవకాశం ఉంది. రానున్నది ఎన్నికల కాలం కావడంతో సామాజిక సమీకరణాలు, కొత్త-పాత అంశాలను పరిగణనలోకి తీసుకుని నేతలకు కమిటీలో చోటు ఇచ్చే ఛాన్స్ ఉంది. నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు చేసిన పలువురు నాయకులు ఇప్పుడు రాష్ట్ర కమిటీలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చాన్సిస్తే వారు మరింత బాధ్యత తీసుకుని పని చేస్తారని.. ఆర్థిక పరంగా కూడా వెనుకడుగు వేయరన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే మళ్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు పదవులు దక్కబోతున్నాయని టీఆర్ఎస్ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.