వచ్చే ఏడాది కేసీఆర్ జనంలోకి వస్తారని కాచుకోవాలని కాంగ్రెస్ కు కేటీఆర్ సవాల్ చేస్తున్నారు కానీ ఆయన అమెరికా వెళ్లిపోతున్నారు. ఆయన అమెరికా పర్యటన, వీసా ఏర్పాట్లు అన్నీ పూర్తయిన తర్వాత ఈ విషయం లీక్ చేశారు. బహుశా.. ఆయన అమెరికా వెళ్లిపోయిన తర్వాత అప్పుడు అసలు సమాచారం అధికారికంగా చెబుతారేమో. అమెరికాలో దాదాపుగా మూడు నెలలు ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. వైద్య చికిత్సతో పాటు మనవడు హిమాన్షు తో ఎక్కువ సమయం గడిపేలా ఆయన టూర్ ప్లాన్ చేసుకున్నారు.
విదేశీ పర్యటనలు అంటే కేసీఆర్కు పెద్దగా ఇష్టం ఉండదు. ఆయన మొదట్లో గల్ఫ్ ఏజెంటు గా పని చేశారని చెప్పుకుంటారు. అయినా ఆయన విదేశాలకు వెళ్లింది చాలా తక్కువ. పదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో ఆయన రెండు సార్లు మాత్రమే విదేశీ పర్యటనకు వెళ్లారు. అమెరికాకు మొదటి సారిగా వెళ్తున్నారు. ఈ సారి పర్యటన పూర్తిగా వ్యక్తిగతం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుండి ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నేతలు పదే పదే సవాళ్లు చేస్తున్నారు., కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని కేటీఆర్ లాంటి వారు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జనంలోకి వస్తారని అనుకున్నారు. భారీ బహిరంగసభను ప్లాన్ చేశారని చెప్పుకున్నారు. కానీ ఆయన మాత్రం అమెరికాకు వెళ్లే ప్లాన్ లో ఉన్నారు.