తెలుగువారికి ఇష్టమైన ఆంధ్రజ్యోతిలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగినందుకు అందరూ విచారించారు. రెండంతస్తులు పూర్తిగా ధగ్గమై పోవడం పెద్ద నష్టమే. ఎసిలో షార్ట్‌సర్క్యూట్ వల్ల ఇది జరిగిందని అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రులతో సహా హేమాహేమీలందరూ వరసకట్టి వెళ్తున్న తీరుచూసి ఆ సంస్థ అధినేత ఆర్కే రాజకీయ పట్టుకు ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ మంత్రివర్గం దాదాపుగా అక్కడే ప్రత్యక్షమైంది. తెలుగుదేశం, టిఆర్ఎస్ ప్రముఖ నేతలంతా సందర్శించారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తరలివచ్చారు. ఈ అధ్యాయం ఇప్పట్లో పూర్తికాదు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా యాత్రకు వెళ్లేలోగానో వచ్చాకనో సందర్శించవచ్చు. ఆయనతో పాటు మరింత మంది ముఖ్యులు. స్వతహాగా చంద్రబాబుకు సన్నిహితులు గనక ఆయన రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఆ మాటకొస్తే కెసిఆర్ ఆర్కేలు వూహించలేనంత స్నేహంగా వుండేవారని ఒకరినొకరు చాలా చనువుగా పిల్చుకునేవారని అంటారు. అయినా ఒకప్పుడు నోరెత్తితే ముందు ఆంధ్రజ్యోతినే విమర్శించేవారు. నమస్తే తెలంగాణలోనూ టిన్యూస్లోనూ ప్రత్యేక కథనాలే వేసేవారు. ఆర్కేను విలన్‌గా చూపించేవారు. కాని సహస్ర చండీయాగంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఈ ఆపత్సమయం పాత మిత్రులను మరింత దగ్గర చేస్తుందని ఉభయశ్రేయోభిలాషులు చెబుతున్నారు, అయితే కెటిఆర్‌తో సరిపెట్టి వుంటే పోయేదని ముఖ్యమంత్రి వెళ్లివుండవలసిన అవసరం లేదని టిఆర్ఎస్ నేతలు కొందరంటున్నారు.సమస్యలలో చిక్కిన రైతులను చూడలేదు గాని మామూలు అగ్ని ప్రమాదానికి వెళ్లాలా అని సోషల్‌మీడియాలో వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఏమైనా ఆర్కేనే మజాకా?