తెలంగాణ ఏర్పడి ఐదేళ్లు కావొస్తోంది. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు, కొత్త రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేస్తున్నారనే నమ్మకంతో రెండోసారి తెరాస ప్రభుత్వానికే ప్రజలు అధికారమిచ్చారు. ఐదేళ్లలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని సాధించామన్నారు. కానీ, ఐదేళ్లు దాటిపోయినా కూడా ఇంకా సమైక్యాంధ్ర వల్లనే వెనకబడ్డామనీ, నాటి పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యామని కేసీఆర్ విమర్శిస్తున్నారు! యాదాద్రి అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… అద్భుతమైన యాదాద్రి క్షేత్రం సమైక్య రాష్ట్రంలో కొంత నిర్లక్ష్యానికి గురైందన్నారు.
ఇక్కడ పనులు చాలా బాగా జరుగుతున్నాయనీ, పునః ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరుగుతుందన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా 1108 హోమ గుండాలను ఏర్పాటు చేస్తామనీ, త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆలయ ప్రతిష్ట ఉంటుందన్నారు. బద్రినాథ్ నుంచి వైష్ణవ సంప్రదాయ స్వాములు వస్తారనీ, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి కూడా వైష్ణవాన్ని ఆచరించేవారూ వస్తారన్నారు. ఆరున్న వేలమంది రుత్వికులు ఏకకాలంలో వేద పఠనం చేస్తారన్నారు. మొత్తంగా ఓ 15 లక్షలమంది ఆ సమయంలో యాదాద్రికి వస్తారన్నది తన అంచనా అన్నారు. ఇక్కడ పనులు వేగంగానే జరుగుతున్నాయనీ, ఆలయ పనులు పూర్తయ్యాకనే ఇతర కార్యక్రమాలపై తానే స్వయంగా ప్రకటన చేస్తానని సీఎం చెప్పారు.
మా నదులు మా నదులు కాలే, మా పుష్కరాలు మా పుష్కరాలు కాలే, మా దేవతల్ని కూడా దేవుళ్లుగా చూడబడలేదని తాను ఉద్యమ సమయంలో చాలాసార్లు చెప్పాననీ, అదే నిజమని కేసీఆర్ అన్నారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగులాంబ ఆలయంలో సరైన సౌకర్యాలు లేకపోయినా ఉపాసకులు ప్రతీయేటా దర్శించుకుటారనీ, దీని గురించి ఎవ్వరికీ తెలీదనీ, అందుకే మా దేవతల్ని సరిగా చూడలేదని తాను అంటానని కేసీఆర్ అన్నారు. వరుసగా రెండోసారి కూడా తెరాస ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. గడచిన ఐదేళ్లగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా. తెలంగాణ గాడిలో పడిందని అంటూనే… ఇంకా ఉద్యమ సమయం గుర్తు చేస్తూ విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది..? ఇలాంటి విమర్శలకు ఇంకా కాలం చెల్లలేదా..?