తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జూన్2న హైదరాబాదులో ప్రపంచ తెలుగుమహాసభలు జరపనున్నట్టు ప్రకటించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అద్యక్షుడుగా నందిని సిధారెడ్డి నియామకంతో పాటే ఈ ప్రకటన కూడా వెలువడింది. ఇతరులు ఎవరి దృష్టిలో లేని ఈ మహాసభ ఆలోచనను కెసిఆర్ హఠాత్తుగా వెల్లడించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇంత స్వల్ప వ్యవధిలో ఘనంగా జరపగలమా అని సందేహాలూ వ్యక్తం చేశారు. 1975లో హైదరాబాదులో మొదటి తెలుగు మహాసభలు, తర్వాత మలేషియాలో, ఆపైన చెన్పైలో జరిగిన తర్వాత వరుసగా వాటి స్వభావం మారింది. విజయవాడ, తిరుపతి తదితర చోట్ల ప్రపంచ మహాసభలు అని పేరు పెట్టినా పరిమిత పరిధిలోనే జరిగాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటి సారి మళ్లీ హైదరాబాదులోనే ఈ మహాసభలను ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక కీలక సంకేతం ఇచ్చారు. ఉద్యమ కాలంలోనే గాక తర్వాత కూడా కొందరు అంటున్నట్టు తెలంగాణ భాషే వేరు అన్న వాదనను పరోక్షంగా నిరాకరించారన్నమాట. తెలంగాణ రాష్ట్ర పరిధిలో భాషా సాహిత్య వికాసాలకు ప్రత్యేకతల పరిరక్షణకు చర్యలు తీసుకున్నా మొత్తంగా తెలుగు భాష మాట్లాడేవారందరినీ ఒక చోట సమీకరించవలసిన అవసరాన్ని గుర్తించారు.అందుకు తామే చొరవ తీసుకున్నారు. ఇది స్వాగతించదగిన విషయమే. ఇందులో మరో విశేషమేమంటే 2012లో కిరణ్ కుమార రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా తిరుపతిలో తెలుగు మహాసభలకు బాధ్యతలు నిర్వహించిన అధికారి రమణాచారి ఇప్పుడు ఆయనకు సలహాదారుగా వున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల సాహిత్య కారులతో ఆయనకు మంచి సంబంధాలే వున్నాయి. ఈ సభల ద్వారా తెలుగు వారందరికి స్నేహ సంకేతాలు పంపాలని ముఖ్యమంత్రి సంకల్పించినట్టు కనిపిస్తుంది.