తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యనే తిరుపతి వెళ్లొచ్చారు. కోట్ల రూపాయాల కానుకల్ని వేంకటేశ్వరునికి సమర్పించారు. ఎప్పుడో తెలంగాణ ఏర్పడక ముందు పెట్టుకున్న మొక్కుల్ని తీర్చుకున్నారు! గతంలో కూడా కొన్ని దేవాలయాలకు వెళ్లారు, భారీ ఎత్తున బంగారు నగలు ఆయా దేవాతామూర్తులకు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. అయితే… కేసీఆర్ గుళ్లూ గోపురాల చుట్టూ తిరగడం సమస్య కాదు! ఆయన వ్యక్తిగత భక్తి విశ్వాసాలు ఆయనకు ఉండొచ్చు. వాటిని ఎవ్వరూ తప్పుబట్టడం లేరు. కానీ, ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చేస్తున్న ఈ తరహా ఖర్చులపైనే అందరీ దృష్టీ పడుతోంది. తన సొంత మొక్కుల చెల్లింపుల కోసం ప్రభుత్వ ఖాతాలోని సొమ్మును ఖర్చు చేయడం ఎంతవరకూ సరైంది..? ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కుల ఖర్చులపై న్యాయస్థానానికి ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమౌతోందని తెలుస్తోంది. సొంత మొక్కుల కోసం ప్రజా ధనాన్ని ఖర్చుచేయడం సరికాదంటూ విమర్శిస్తున్నారు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి. కామన్ గుడ్ ఫండ్ పేరుతో నిధుల్ని సొంత మొక్కుల కోసమో, దేవాలయాలకు కానుకలుగా ఇచ్చేందుకు వాడుకోవడం చట్ట విరుద్ధం అవుతుందని అంటున్నారు. అంతేకాదు, దేవాదాయ శాఖ చట్టం సెక్షన్-70 ప్రకారం ఇలాంటి ఖర్చులు చెల్లవనీ ఆయన వివరించారు. ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో పార్టీ ఉందని శశిధర్ రెడ్డి చెప్పారు.
నిజానికి, ఇలాంటి ఇష్యూపై న్యాయస్థానం దృష్టి సారిస్తేనే మంచిది. ఎందుకంటే, ప్రజా ప్రతినిధులు అంటే ప్రజల సొమ్ముకు కాపలాదారులే, అంతేగానీ యజమానులు కాదు కదా! ఇంకోటీ… కేసీఆర్ మొక్కుల విషయమే తీసుకుంటే, ఆయన తెలంగాణ సిద్ధించాలని మొక్కుకున్నారా…? లేదా, తెరాస అధికారంలోకి రావాలనీ, తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారా..? జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తే… దాన్ని సాంస్కృతిక పరిరక్షణ అనే యాంగిల్లో సమర్థించుకోవచ్చు. అంతేగానీ, ఇలా సొంత మొక్కుల కోసం ప్రజాధనం వాడకం అనేది కచ్చితంగా నిలదీయాల్సిన అంశమే.
ఇలాంటి ధోరణికి ఎక్కడో చోట ఒక చెక్ పడాలి. లేదంటే, ఇవాళ్ల కేసీఆర్ చేస్తున్నదే రేపటి తరాలకు అలవాటైపోతుంది! అయినా, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల భక్తి విశ్వాసాలు గడపదాటి బయటకి రాకూడదు. ఎందుకంటే, ఆయన ఒక రాష్ట్ర ప్రజలందరినీ పాలిస్తుంటారు. రాష్ట్రంలో ఎన్నో మతాల ప్రజలు ఉంటారు. అందరినీ సమదృష్టితో చూసుకుంటున్నారు అనే ఫీలింగ్ ప్రజల్లో కలగాలంటే.. వ్యక్తిగత భక్తి విశ్వాసాలను, నమ్మకాలను ప్రజల ముందు ప్రదర్శించడం తగ్గాలి.