కావాలి జగన్.. రావాలి జగన్ అని ఏపీలో సోదరుడు జగన్ పాడించిన పాటను స్ఫూర్తిగా తీసుకున్నారు సోదరి షర్మిల. ఆ స్లోగన్‌కు కాస్త మార్పులు చేసుకున్నారు.. పోవాలని దొర రాజ్యం.. రావాలి రాజన్న రాజ్యం అనే స్లోగన్ రెడీ చేసుకున్నారు. అంటే….ఆమె కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారన్నమాట. తాను కొండను ఢీకొడుతున్నానని… బట్టీపట్టీ వచ్చి చెబుతున్నట్లుగా ఇప్పటికే చెబుతున్నారు. ఈ క్రమంలో షర్మిల రాజకీయ వ్యూహకర్తలు… కేసీఆర్ వర్సెస్ రాజన్న అనే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ పాలనలో సంక్షేమం.. రాజన్న పాలనలో సంక్షేమం చూపించి..ఓట్లు అడగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వ్యూహం ఖరారు చేసుకుని సోషల్ మీడియా క్యాంపెయినింగ్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పార్టీ లాంచింగ్‌లోనే తన పార్టీపై వస్తున్న సందేహాలకు చెక్ పెట్టేందుకు…భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ తొమ్మిదో తేదీన షర్మిల రాజకీయ పార్టీ ప్రకటన… ఖమ్మంలో జరగనుంది. ఇందు కోసం..ఇప్పటికే… సభ అనుమతి తీసుకున్నారు. కనీసం లక్ష మంది హాజరయ్యేలా జన సమీకరణకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒక్క ఖమ్మం నుంచి మాత్రమే కాకుండా… అన్ని జిల్లాల నుంచి నేతలు హాజరయ్యేలా చూడాలనుకుంటున్నారు. ఆత్మీయ సమ్మేళనాలకు..ఆరేడు వందల మందిని ఆహ్వానిస్తున్నారు. రెండు,మూడువందల మంది వస్తున్నారు. షర్మిల పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదనే ఫీలింగ్ రాకుండా… వారానికి రెండు సార్లు అయినా ఓ మాదిరి ప్రముఖులు లోటస్ పాండ్‌కు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఖమ్మం సభ తర్వాత.. ఇక వ్యూహం మార్చి… నేరుగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్‌నే టార్గెట్ చేసుకోవడంతో… ఇక రాజన్న వర్సెస్ కేసీఆర్ అన్నంత ఎఫెక్ట్ వస్తుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా.. ఈ పరిస్థితిని మరింతగా ప్రోత్సహించే అవకాశం ఉంది. సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసిన వైఎస్‌కు పోటీగా కేసీఆర్‌ను పెడితే… సెంటిమెంట్ పండించుకోవడానికి… టీఆర్ఎస్ నేతలకు కావాల్సింది ఏముంటుంది..? .