ఓ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వరుసగా కాంగ్రెస్ లాగేసుకుంటుంది. మరోవైపు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ స్కెచ్ వేస్తోంది. బీఆర్ఎస్ కు ఏమాత్రం స్పేస్ ఇవ్వొద్దని రెండు పార్టీలు దూకుడుగా రాజకీయం చేస్తున్నాయి. ఇలా ముప్పేట దాడి కొనసాగుతోన్నా బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం మౌనం వీడకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
బీఆర్ఎస్ ను మరింత బలహీనపరిచేలా కాంగ్రెస్, బీజేపీలు రాజకీయాలు చేస్తోన్నా కేసీఆర్ సైలెన్స్ నే ఆశ్రయించడం ఆ పార్టీ నేతలను సైతం ఆలోచన పడేస్తోంది. ప్రత్యక్ష ప్రజా పోరాటాలతో పార్టీని బలీయమైన శక్తిగా మార్చుకునే అవకాశం ఉన్నా కేసీఆర్ ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నారు అనేది ఆ పార్టీ నేతల ప్రశ్న. నీట్ పేపర్ లీకేజీ, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ, పెద్దపల్లి చిన్నారి ఘటనపై బీఆర్ఎస్ ప్రజా పోరాటాలకు పిలుపునివ్వకుండా కేవలం సోషల్ మీడియా ప్రకటనలకే పరిమితం కావడంపై విమర్శలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్లేసును అక్యుపై చేయాలనుకుంటున్న బీజేపీని టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ కు అందివచ్చిన అవకాశం నీట్ పేపర్ లీకేజీ. అయినా ఈ అంశంలో బీఆర్ఎస్ రాజ్ భవన్ ముట్టడి తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ కార్యక్రమాలను చేపట్టలేక అందివచ్చిన అవకాశాన్ని కూడా జారవిడుచుకుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బొగ్గుగనుల వేలంపై కూడా ప్రెస్ మీట్లకే పరిమితమైతమంది తప్పితే ప్రత్యక్ష పోరాటాలకు దిగలేకపోయింది బీఆర్ఎస్.
ప్రజా పోరాటాలకు శ్రీకారం చుట్టి మునుపటిలా ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉన్నా బీఆర్ఎస్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. కేసీఆర్ ఫామ్ హౌజ్ వీడకపోవడం, పార్టీ నేతలను పిలిచి భవిష్యత్ కార్యచరణ ప్రకటించకపోవడంపై ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ కు అసలు ఏమైంది..? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.
ప్రస్తుత సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసనలకు పిలుపునిస్తే అది ఎక్కడ ఫెయిల్ అవుతుందోననే భయంతోనే కేసీఆర్ వెనకడుగు వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే బీఆర్ఎస్ కు మరింత డ్యామేజ్ అవుతుంది అనే ముందుచూపుతో కేసీఆర్ వెయిట్ అండ్ సీ అనే తరహాలో రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు.