తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు ఏంటో ఒక్కోసారి ఇట్టే కొరుకుడు పడవు! కేంద్రంలోని అధికార భాజపాకి దగ్గరయ్యేట్టుగానే ఈ మధ్య వ్యవహరిస్తూ వచ్చారు. గత ఏడాది కేంద్రం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విషయంలో సమర్థన మొదలుకొని.. తాజాగా రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి మద్దతు వరకూ కేసీఆర్ అనుసరించి వైఖరి సుస్పష్టంగా ఉంది. భాజపాతో అప్రకటిత పొత్తును కొనసాగిస్తున్న వాతావరణమే కనిపించేది. కానీ, ఇప్పుడు జీఎస్టీ విషయంలో కేంద్రంతో పోరాటానికి సై అంటున్నారు! తాము ఆశించినట్టు సానుకూల స్పందన రాకపోతే కేంద్రంతో అమీతుమీ తప్పదని చెబుతున్నారు. ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల విషయమై జీఎస్టీ తగ్గించకపోతే న్యాయ పోరాటం తప్పదు అంటున్నారు.
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రజాప్రయోజన ప్రాజెక్టులపై 12 శాతం జీఎస్టీ తగదని కేసీఆర్ అభిప్రాయడ్డారు. జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తే, అంతకుముందు జూన్ 30 నాటికే ప్రారంభమైన ప్రాజెక్టులకు కూడా వస్తు సేవల పన్ను వర్తింపజేయడం ఎంతవరకూ సమంజసం అనేది కేసీఆర్ ప్రశ్న? ఇదే విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయాలని తీర్మానించారు. నిజానికి, ఇప్పటికే లేఖ సిద్ధం కావాల్సి ఉంది. కానీ, మిషన్ భగీరథ, రహదారుల నిర్మాణం, ఇళ్ల నిర్మాణం వంటి పథకాల వారీ వివరాలు లెక్కగట్టి, ఇంతవరకూ అయిన ఖర్చు ఎంత..? జీఎస్టీ అమలుతో ఈ పథకాల అమలు విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై పడబోతున్న భారమెంత అనేది కూడా సమగ్రంగా లెక్కించి, ప్రధానికి పంపబోతున్న లేఖలో పొందుపరచాలని భావిస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై జీఎస్టీ తగ్గించాలని మొదట్నుంచీ తెరాస పోరాడుతోందనీ, దీంతోనే 18 నుంచి 12 శాతానికి పన్ను తగ్గించారనీ, అయినా ఇంకా సరిపోదని కేసీఆర్ అన్నారు. జీఎస్టీని ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు వర్తింపజేయడం న్యాయం కాదని ముఖ్యమంత్రి చెప్పారు.
జీఎస్టీ తగ్గింపు విషయమై సమగ్ర వివరాలతో ప్రధానికి లేఖ రాసిన తరువాత, దానిపై నరేంద్ర మోడీ స్పందన ఎలా ఉంటుందో వేచి చూద్దామని నిర్ణయించారు. సానుకూలంగా స్పందిస్తే ఫర్వాలేదనీ, లేదంటే న్యాయ పోరాటానికి వెళ్దామని ముఖ్యమంత్రి స్పష్టం చేయడం విశేషం! దీంతో కేసీఆర్ లేఖపై కేంద్రం స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారబోతోంది. ఒకటి మాత్రం వాస్తవం.. జీఎస్టీ వల్ల కేంద్ర ప్రభుత్వ ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడుతోంది. అంటే, ఇకపై నిధుల విషయంలో ఎప్పటికప్పుడు కేంద్రంపై రాష్ట్రాలు ఆధారపడాల్సిన అవసరం వస్తుంది.
దీని అంతిమ ప్రయోజనం దేశవ్యాప్తంగా ఒకే పన్ను ఉండాలన్నది నరేంద్ర మోడీ సర్కారు లక్ష్యంగా చెబుతున్నా, రాజకీయ కోణం నుంచి చూస్తుంటే.. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలనే వ్యూహం కనిపిస్తుంది. కేసీఆర్ పోరాటం వెనక ప్రేరణ కూడా ఇదే కావొచ్చు. తెలంగాణ సిద్ధించాక పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం కేసీఆర్ చేపట్టారు. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. లేదంటే, వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షాలకు ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతుంది. ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే నిధుల లభ్యత సరిచూసుకోవాలి. అనవసర ఖర్చుల భారం, జీఎస్టీ రూపంలో టాక్సుల భారం కొంత తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంతో రాజకీయ అవసరం ఎంతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి, కేంద్రంతో కేసీఆర్ పోరాటానికి సిద్ధపడటం అనివార్య పరిస్థితే అనొచ్చు.