ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయలేదని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఏడాది రూ. యాభై వేల వరకూ ఉన్న రైతుల రుణాలను చెల్లించాలని నిర్ణయించారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలలోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా నిర్దేశించుకున్నారు. కేబినెట్ నిర్ణయంతో రూ.50వేల లోపు రుణం తీసుకున్న 6లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు పంటరుణ మాఫీ వివరాలను అర్థికశాఖ అధికారులకు కేబినెట్‌కు అందజేశారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లే సమయంలో… రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇది ఆ పార్టీకి ఎక్కడ ప్లస్ అవుతుందని అనుకున్నారో కానీ కేసీఆర్ కూడా రూ. లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదు. కేసీఆర్‌కే ఓట్లేశారు. అయితే ఆ తర్వాత రుణమాఫీ పథకం అమలు చేయడానికి సమస్యలు ఎదురయ్యాయి. ఆర్థికంగా ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. ఏడాది తర్వాత రుణమాఫీ పథకం అమలు చేయడానికి విధివిధానాలు ఖరారు చేశారు. బ్యాంకులతో సంబంధం లేకుండా… రూ. లక్ష రైతులకు విడతల వారీగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ కరోనా వచ్చి పడటంతో అది కూడా ఆగిపోయింది.
కొద్ది రోజుల క్రితం.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కరోనా వైరస్ వల్ల రుణమాఫీ ఆలస్యమైందని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈ నెలలలోనే అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. రుణమాఫీ పథకాన్ని అమలు చేయకుండా.. నిధులన్నీ హుజూరాబాద్‌లో ఖర్చు పెడుతన్నారన్న విమర్శలు రావడం కూడా.. కేసీఆర్ నిర్ణయానికి కారణంగా భావిస్తున్నారు. కారణం ఏదైతేనేం.. రూ. యాభై వేల లోపు ఉన్న రుణాలన్నీ… రైతులకు తీరిపోయే అవకాశం కనిపిస్తోంది.