గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస సంచలన విజయం సాధించింది. క్రితం సారి నగరంలో అసలు పోటీ చేయని పార్టీ, ఈసారి 99 సీట్లు గెల్చుకోవడం విశేషం. పథకాలు, తాయిలాలు, పదులైన ప్రసంగాలు వగైరా అస్త్రాల ద్వారా కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ అనుకున్నది సాధించారు. ఇక ప్రతినెలా నల్లా బిల్లు, కరెంటు బిల్లు కట్టనవసరం లేదేమో అనే చర్చ అప్పుడే మొదలైంది. జంట నగరాల్లో నల్లా, కరెంటు బిల్లు బకాయిలను గత డిసెంబర్లో తెరాస ప్రభుత్వం రద్దు చేసింది. గ్రేటర్ ఎన్నికల కు కొన్ని రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఎన్నికల తాయిలమని, ప్రజలకు లంచం ఇవ్వడం వంటిదేనని ప్రతిపక్షాలు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 423 కోట్ల రూపాయలు సదరు ప్రభుత్వ విభాగాలకు రాకుండా పోయాయి. 6 లక్షల మంది కరెంటు వినియోగదారులు, 3 లక్షల మంది నల్లా వినియోగదారులు ఖుషీ అయ్యారు. ఇది కూడా ఎన్నికల్లో ప్రభావం చూపిందని ఫలితాలు స్పష్టంగా చెప్తున్నాయి. అంటే, 423 కోట్ల రూపాయల ఖరీదైన తాయిలాల ద్వారా మంచి ఫలితాలను సాధించ వచ్చనే ఒక ఉదాహరణ మన కళ్ల ముందు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఓట్ల కోసం ప్రకటించిన తాయిలం శాశ్వతంగా కొనసాగించాలని ప్రజలు కోరితే సరేనంటారా? ఇక మీదట కరెంటు, నల్లా బిల్లులను కట్టేది లేదు, ఏదో ఒకరోజు కేసీఆర్ ఈ బకాయిలను మాఫీ చేస్తారని ప్రజలు భావిస్తే పరిస్థితి ఏమిటి? ఠంచనుగా బిల్లులు చెల్లించిన వారికి కేసీఆర్ ఇచ్చే సందేశం ఏమిటి? ఎప్పటికప్పుడు బిల్లు కడితే నష్టపోతారని, అలా కట్టే వాల్లు పిచ్చివాళ్లని ప్రభుత్వం సంకేతం ఇచ్చినట్టా? డబుల్ బెడ్ రూం ఇళ్లు, మిషన్ కాకతీయ, జలహారం, వంటి ప్రజోపయోగ పనులను చూపించి ఓట్లు అడగటం వేరు. సరిగ్గా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఖజానాకు 423 కోట్ల నష్టం కలిగించే తాయిలాలు ప్రకటించడంపై అప్పుడే ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు. ఈ ప్రకటన వల్ల ఇకముందు కూడా ప్రజల్లో క్రమ శిక్షణ రాహిత్య పెరిగితే, ఏ బిల్లూ కట్టకుండా మొండికేసే వారి సంఖ్య పెరిగితే? అది బంగారు తెలంగాణ సాధనకు అవరోధం కాదా? ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయమిది.