హైకోర్టు విభజనపై తాత్సారాన్ని ఇక సహించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. న్యాయాధికారుల ఆందోళన, ఇద్దరు జడ్జిలను హైకోర్టు సస్పెండ్ చేయడం వంటి కారణాలతో ఆయన స్వయంగా రంగంలోకి దిగనున్నారు. హైకోర్టు విభజనలో జాప్యానికి నిరసనగా అతి త్వరలోనే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయబోతున్నారు.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైకోర్టు విభజన కూడా జరగాలి. విభజన చట్టంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. అయితే ఇందుకు కాలపరిమితి మాత్రం చట్టంలో లేదు. అందుకే కేంద్రం కావాలని జాప్యం చేస్తోందనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం. దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందనే భావన గత రెండేళ్లుగా ఉంది. తాజాగా న్యాయాధికారుల ఆందోళనతో ఈ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది.
జడ్జిల సస్పెన్సన్ కు నిరసనగా అన్ని కేడర్ల న్యాయాధికారులు మంగళవారం నుంచి సామూహిక సెలవు పెట్టాలని నిర్ణయించారు. ఆందోళన రోజురోజుకూ తీవ్రమవుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం కేసీఆర్ కు ఆగ్రహం కలిగించింది. వీలైనంత త్వరగా చేయాల్సిన పనిని ఇంత ఆలస్యం చేయడం కేవలం ఉద్దేశపూర్వకమే అనే అభిప్రాయం చాలా మంది తెలంగాణ వాదుల్లో ఉంది.
హైకోర్టు విభజనకు అన్ని విధాలా సహకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది. రాజధాని నిర్మాణం జరిగే వరకూ ఏపీ హైకోర్టు కోసం హైదరాబాదులో స్థలం, భవనం ఇవ్వడానికి సిద్ధమని తెలిపింది. ఏపీ ప్రభుత్వం కోరుకున్న ప్రకారం ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఈ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కోర్టు విభజన ప్రక్రియను ప్రారంభించాలని కోరింది. తెరాస ఎంపీలు అనేక సార్లు ఈ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావించారు. ఇది పరిశీలనలో ఉంది, హైకోర్టు పరిశీలిస్తోందని న్యాయశాఖ మంత్రి జవాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రెండేళ్లలో ఈ పని పూర్తయి ఉండేదని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది.
ఢిల్లీలో దీక్ష ద్వారా ఈ అంశం దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసేలా చేయడం ఒక ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం కేసీఆర్ ప్రధానోద్దేశం. ధర్నా తర్వాత కూడా కేంద్రం మొండిగా వ్యవహరిస్తే ఏంచేయాలో తర్వాత నిర్ణయిస్తారు. కేంద్రం ఉద్దేశ పూర్వకంగా హైకోర్టు విభజనలో జాప్యం చేస్తోందని దేశమంతా అర్థమయ్యేలా చేస్తే కేంద్రంలో కదలిక వస్తుందనేది కేసీఆర్ ఉద్దేశమని తెరాస వర్గాలు చెప్తున్నాయి.